సల్మాన్‌ఖాన్ నిర్దోషి
కృష్ణజింకల వేట కేసులో రాజస్తాన్ హైకోర్టు తీర్పు
జోధ్‌పూర్ : కృష్ణజింకల వేటకు సంబంధించిన రెండు కేసుల్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను రాజస్తాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో సల్మాన్, అతని సహ నటులు కలసి కృష్ణజింకలను వేటాడినట్టు కేసులు ఉన్నాయి. సల్మాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 ప్రకారం ఇవి నమోదయ్యాయి. ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి.. ఒక కేసులో ఏడాది జైలు శిక్ష, మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై సల్మాన్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకున్నారు. మిథానియా కేసులో సల్మాన్ అప్పీలును తిరస్కరించిన కోర్టు.. భావద్ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీళ్లూ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ పిటిషన్లన్నీ కలిపి 2015 నవంబర్ 16న హైకోర్టు విచారణ ప్రారంభించింది. విచారణ జరిపి ఈ ఏడాది మే 13న తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. సోమవారం తుది తీర్పులు వెలువరించినజస్టిస్ నిర్మలాజిత్ కౌర్ రెండు కేసుల్లోనూ సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించారు. సల్మాన్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీళ్లను తోసిపుచ్చారు. ఘటనా స్థలంలో లభించిన జింకల కళేబరాల నుంచి సేకరించిన పెల్లెట్లు.. సల్మాన్‌కు చెందిన లెసైన్స్డ్ తుపాకీతో కాల్చినవి కాదని తేలిందన్నారు. వేట సమయంలో సల్మాన్, అతని టీమ్ వాడిన జీప్ డ్రైవర్ కనిపించకుండాపోవడంతో కేసు బలహీనపడింది. అయితే అదనపు అడ్వొకేట్ జనరల్ కేఎల్ టాకూర్ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పుపై అప్పీలు చేసే అంశంపై ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.