అహ్మదాబాద్ : కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఓ సెలూన్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. కస్టమర్లకు హెయిర్ కట్ చేసే సమయంలో కరోనా సోకకుండా ఉండేందకు రక్షణగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) కిట్లను ధరిస్తున్నారు. గుజరాత్ నడియాద్‌లోని ఓ సెలూన్ షాప్ యజమాని.. తన షాప్‌లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీంతో ఆ సెలూన్ షాప్‌లోకి సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి కస్టమర్లకు హెయిర్‌కట్ చేస్తున్నారు. హెయిర్ కట్ చేసే సిబ్బంది పూర్తి స్థాయి పీపీఈ కిట్లు ధరించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
మరోవైపు ఆ సెలూన్‌కు వస్తున్న కస్టమర్లు కూడా ముఖానికి మాస్క్‌లు ధరించడంతోపాటుగా, భౌతిక దూరం నిబంధనను విధిగా పాటిస్తున్నారు. దీనిపై ఆ సెలూన్ షాప్ యజమాని విశాల్ మాట్లాడుతూ.. తమ సిబ్బందికి, కస్టమర్లకు కరోనా సోకకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్టు తెలిపారు. కాగా, కరోనా వ్యాప్తికి అడ్డకట్టవేయడంలో పీపీఈ కిట్లు కీలక భూమిక పోషిస్తాయనే సంగతి తెలిసిందే. కేవలం కరోనా చికిత్స కేంద్రాలలోనే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు కూడా వీటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తే కరోనా వ్యాప్తిని మరింత సమర్థవంతంగా అడ్డుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. (చదవండి : జూమ్ కాల్‌తో 3700మందికి ఉబెర్ ఉద్వాసన)
Comments
Please login to add a commentAdd a comment