ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ | same organization to the Entrance exams | Sakshi
Sakshi News home page

ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ

Published Thu, Feb 2 2017 2:31 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ - Sakshi

ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ

  • కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడి
  • నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాటు
  • యూజీసీలో సంస్కరణలకు శ్రీకారం
  • పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం డిజిటల్‌ లైబ్రరీ
  • నాణ్యమైన విద్యతోనే యువత సాధికారత సాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నొక్కి చెప్పారు. దేశంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులకు తెరతీసే చర్యలను ఆయన బుధవారం బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ సంస్కరణల్లో అత్యంత కీలకమైంది.. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం అన్ని రకాల ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు స్వయం ప్రతిపత్తి గల ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ఏర్పాటు. ఈ ఏజెన్సీ రాకతో సీబీఎస్‌ఈ, ఏఐసీటీఈ వంటి సంస్థలకు పరీక్ష నిర్వహణ బాధ్యతల నుంచి వెసులుబాటు కలుగుతుందని జైట్లీ చెప్పారు. బడ్జెట్‌లో పాఠశాల విద్య, అక్షరాస్యతకు రూ.46,356 కోట్లు, ఉన్నత విద్యకు రూ.33,329 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.    
     – న్యూఢిల్లీ

    ‘స్వయం’ ద్వారా 350 ఆన్‌లైన్‌ కోర్సులు
    మన దేశంలో పాఠశాలలు సాధిస్తున్న వార్షిక ఫలితాలను కచ్చితంగా తెలుసుకునేందుకు ఒక పటిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఉందని జైట్లీ చెప్పారు. శాస్త్రీయ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా సరళమైన కోర్సులను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యలో నాణ్యతను పెంచేందుకు, మన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యనందించేందుకు ‘ఇన్నోవేటివ్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో విద్యాపరంగా వెనుకబడ్డ 3,479 ప్రాంతాలపై ఇకపై మరింత దృష్టి పెడతామన్నారు. ఐసీటీ ద్వారా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ‘స్వయం’వేదిక ద్వారా అత్యుత్తమ నాణ్యతతో కూడిన 350 ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తామన్నారు. డీటీహెచ్‌ చానళ్లలోనూ ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. యూజీసీలో సంస్కరణలకు శ్రీకారం చుడతామని అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. అక్రిడిటేషన్, ర్యాంకింగ్‌ల ఆధారంగా విద్యాసంస్థలకు గుర్తింపు, స్వయం పాలిత(అటానమస్‌) హోదా ఇవ్వనున్నట్లు తెలిపారు.

    110 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
    జార్ఖండ్, గుజరాత్‌లోఎయిమ్స్‌లు ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. మెడికల్‌ సైన్సెస్‌లో పీజీ సీట్లను పెంచుతామన్నారు. దేశవ్యాప్తంగా 600కుపైగా జిల్లాల్లో ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్రాలను విస్తరింపజేస్తామని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందగోరే యువతకు సహకరించేందుకు 110 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. వొకేషనల్‌ విద్యకు రూ.2,200 కోట్లు కేటాయించారు. రూ.4,000 కోట్లతో స్కిల్‌ అక్విజిషన్, నాలెడ్జ్‌ అవేర్‌నెస్‌ ఫర్‌ లైవ్లీహుడ్‌ ప్రమోషన్‌ ప్రోగ్రామ్‌(సంకల్ప్‌)ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తోలు, పాదరక్షల పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

    10 ప్రపంచస్థాయి విద్యాసంస్థలు
    జాతీయస్థాయిలో డిజిటల్‌ లైబ్రరీని అభివృద్ధిపర్చాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యామిషన్‌లో భాగంగా ఐసీటీ కింద ఈ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, పరిశోధకులకు ఇది కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ యూనివర్సిటీలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా యూనివర్సిటీ ఆఫ్‌ హిమాలయన్‌ స్టడీస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో 10 ప్రపంచస్థాయి విద్యాసంస్థలను నెలకొల్పనున్నారు. పరిశోధనలు చేసే ప్రొఫెసర్ల కోసం ప్రత్యేక కేటాయింపులు చేశారు.

    బడ్జెట్‌ హైలైట్స్‌
    ► ‘టెక్‌ (టీఈసీ–ట్రాన్స్‌ఫామ్, ఎనరై్జస్,క్లీన్‌ ఇండియా)’ఎజెండాతో బడ్జెట్‌
    ► రూ.2.5 లక్షలు–రూ.5 లక్షల మధ్య ఆదాయంపై పన్ను 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
    ► రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఆదాయంపై 10 శాతం సర్‌చార్జీ విధింపు
    ► ఎల్‌ఎన్‌జీపై కస్టమ్స్‌ పన్ను 2.5 శాతానికి తగ్గింపు
    ► రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు పైబడిన నగదు విరాళాలపై నిషేధం. కేవలం చెక్కులు, ఇతర డిజిటల్‌ రూపాల్లోనే స్వీకరించాలి
    ► ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ఎలక్టోరల్‌ బాండ్ల జారీ
    ► వయోవృద్ధులకు ఆధార్‌ ఆధారిత ఆరోగ్య కార్డులు, కనీసం 8 శాతం రాబడినిచ్చే పథకం
    ► ఎఫ్‌డీఐలను ప్రోత్సహించేందుకు ‘ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎఫ్‌ఐపీబీ)’ రద్దు
    ► రైల్వే అనుబంధ సంస్థలైన ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ, ఐఆర్‌సీఓఎన్‌లు స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌
    ► డిజిటల్‌ పేమెంట్ల పర్యవేక్షణకు ‘పేమెంట్‌ రెగ్యులేటరీ బోర్డు’ ఏర్పాటు
    ► ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రైల్వే భద్రతా నిధి ఏర్పాటు.
    ► రైల్వేల్లో అభివృద్ధి పనులకు రూ.1.31 లక్షల కోట్లు. ఇందులో కేంద్ర నుంచి రూ.55 వేల కోట్లు.
    ► స్థిరాస్తులపై దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను గడువు మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు
    ► ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం  రూ.72,000 కోట్లు..  డిజిటల్‌ పేమెంట్లకు ప్రోత్సాహమిచ్చేలా పీవోఎస్‌ యంత్రాలు, ఐరిస్‌ రీడర్లపై పన్ను మినహాయింపు
    ► వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.8 శాతం, పరోక్ష పన్నుల వసూళ్లు 8.3 శాతం పెరుగుతాయని అంచనా.
    ► మౌలిక సదుపాయాలపై పెట్టుబడి రూ.3.96 లక్షల కోట్లకు పెంపు.. రూ.2 వేల కోట్ల కార్ఫస్‌ ఫండ్‌తో డెయిరీ ప్రాసెసింగ్‌ ఫండ్‌ ఏర్పాటు
    ► మహిళా, శిశు సంక్షేమ పథకాలకు రూ.1.84 లక్షల కోట్లు.. గ్రామీణ, వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.87 లక్షల కోట్లు
    ► పేదలకు 2019 నాటికి కోటి గృహాల నిర్మాణం
    ► ఎస్టీలకు రూ.31,920 కోట్లు, మైనారిటీ వ్యవహారాలకు రూ.4,195 కోట్లు
    ► రైలు, రోడ్డు, నౌకాయాన రంగాలకు రూ.2.41 లక్షల కోట్లు
    ► దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ కవరేజీ విస్తృతి కోసం ‘భారత్‌ నెట్‌’ప్రాజెక్టుకు రూ.10,000 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement