మున్నాభాయ్కి భారీ ఊరట!
ముంబై: ప్రస్తుతం ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది. ఆయనను శిక్షాకాలం గడువు కన్నా దాదాపు ఆరు నెలలు ముందే విడుదలే చేసే అవకాశముందని ఓ మహారాష్ట్ర దినపత్రిక తెలిపింది. జైల్లో మున్నాభాయ్ సత్ప్రవర్తనే అందుకు కారణమట. జైలుశిక్షాకాలంలో ఖైదీ సత్ప్రవర్తనతో వ్యవహరిస్తే అతనికి 114 రోజులపాటు శిక్షను తగ్గించే అవకాశముంది. ఈ మేరకు చట్టాల్లో ఉన్న ఓ క్లాజును ఎరవాడ జైలు అధికారులు పరిశీలిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది.
ఆ క్లాజు ఏం చెప్తోంది..!
జైలు నిబంధనలకు సంబంధించిన ఓ క్లాజు ప్రకారం ఖైదీ ప్రవర్తన బాగుంటే అతనికి మూడు రోజులు సెలవు ఇస్తారు. అదేవిధంగా తాను ఎంచుకున్న వృత్తిలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే నాలుగు రోజుల వరకు సెలవు పొందే అవకాశముంది. ఈ లెక్కన ఓ నెలలో ఏడురోజుల వరకు సెలవు పొందవచ్చు. అంతేకాకుండా ఒక ఏడాదికాలంలో ఖైదీ ఆదర్శప్రాయమైన ప్రవర్తన కనబరిస్తే అతనికి 30రోజల వరకు సెలవు ఇవ్వవచ్చు. ఈ సెలవు 30 రోజులా లేక 60 రోజులా లేక 10 రోజులా అన్నది నిర్ణయించే అధికారం జైలు సబ్ సూపర్ వైజర్, చీఫ్ సూపర్ వైజర్, సీనియర్ పోలీసుల అధికారుల చేతిలో ఉంటుంది.
మున్నాభాయ్ సత్ప్రవర్తన..
జైలులో అత్యంత బుద్ధిమంతుడిగా ఉంటూ తోటి ఖైదీలతో స్నేహంగా మెలుగుతున్న మున్నాభాయ్ కి నెలకు ఏడు రోజులు, సంవత్సరానికి 30 రోజుల చొప్పున తన ఐదేళ్ల శిక్షాకాలంలో మొత్తం 114 రోజుల సెలవు దొరికే అవకాశముంది. దీంతో శిక్షాకాలం నిర్ణీత గడువు కన్నా దాదాపు ఆరు నెలలముందే సంజయ్ విడుదల కావొచ్చునని భావిస్తున్నట్టు ఆ దినపత్రిక తెలిపింది.
1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడని ఆరోపణలతో సంజయ్ దత్ కు జైలుశిక్ష పడింది. ఇప్పటికే ఆయన పలుసార్లు పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబసభ్యులతో గడిపారు.