బీజేపీ కార్పోరేటర్ పై ఎంపీ నిరుపమ్ దౌర్జన్యం
Published Wed, Mar 5 2014 8:42 PM | Last Updated on Fri, Mar 29 2019 9:14 PM
ఓ బీజేపీ కార్పోరేటర్ పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ సంజయ్ నిరుపమ్ దాడికి పాల్పడ్డారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ కార్పోరేటర్ కు చెందిన మొబైల్ ఫోన్ ను సంజయ్ నిరుపమ్ ధ్వంసం చేశారు. కార్పోరేటర్ వినోద్ షెలార్ ఫిర్యాదు మేరకు నిరుపమ్ పై కేసు నమోదు చేశారు. దిండోషి సబర్బన్ లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిరుపమ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని స్తానిక కార్పోరేటర్ వినోద్ అడ్డుకున్నారు.
కొద్ది రోజుల క్రితమే బీజేపీ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించిందని.. ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్దేశంతోనే మళ్లీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపిస్తూ కార్పోరేటర్ వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అవుతుందని కార్పోరేటర్ హెచ్చరించారు.
దాంతో ఎంపీ, కార్పోరేటర్ మధ్య గొడవ పెరిగింది. ఆతర్వాత కార్పోరేటర్ కు చెందిన మొబైల్ ఫోన్ లాక్కొని.. ఎంపీ నేలకేసి కొట్టినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఎంపీ తీరును నిరసిస్తూ కార్పోరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎంపి నిరుపమ్ పై ఐపీసీ సెక్షన్ 427, 504 కింద కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement