సాక్షి, న్యూఢిల్లీ : నార్త్ ఇండియన్స్‌కు సరైన నైపుణ్యాలు లేవని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వర్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించడంతో తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యల సందర్భం వేరని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజల నైపుణ్యాలను పెంచేందుకు చేపడుతున్న చర్యలను వివరించే ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. నైపుణ్యాలు లేనివారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు తగిన అర్హతలను వారికి అందించేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందనే కోణంలో తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఉపాధి అవకాశాలు కొరవడిన తీరుపై కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరి వంద రోజులైన నేపథ్యంలో రాయ్‌బరేలిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉద్యోగాలు పెద్దసంఖ్యలో అందుబాటులో ఉన్నాయని అయితే నార్త్ ఇండియన్స్‌లో నైపుణ్యాలు లోపించడమే సమస్యని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment