భర్త నటరాజన్ మృతదేహం వద్ద శశికళ కన్నీళ్లు
సాక్షి, చెన్నై : భర్త నటరాజన్ మరణంతో చిన్నమ్మ శశికళ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన మృతదేహం పక్కనే గంటల తరబడి కూర్చుండిపోయారు. బోరున విలపిస్తున్న ఆమెను ఓదర్చాడం ఎవరి తరం కాలేదు. ఇక, నటరాజన్ భౌతిక కాయానికి కన్నీటి వీడ్కోలు పలికారు.
చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ అనారోగ్యంతో మంగళవారం మరణించిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి తంజావూరుకు నటరాజన్ మృతదేహాన్ని తరలించారు. ఈ సమాచారంతో పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పదిహేను రోజుల పెరోల్ లభించడంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమెను కృష్ణగిరి వద్ద అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌తో పాటు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు పలువురు ఆహ్వానించారు. తమ వాహనంలో ఆమెను వెంట బెట్టుకుని తంజావూరుకు బయలుదేరారు. ముసిరి వద్దకు మంగళవారం అర్ధరాత్రి ఆమె చేరుకోవడతో సోదరుడు దివాకరన్ తోడయ్యారు. సోదరుడు దివాకరన్, అక్క కుమారుడు దినకరన్‌లతో కలిసి తంజావూరులోని నటరాజన్ స్వగ్రామం విలార్‌కు వెళ్లారు. అక్కడ భర్త మృతదేహాన్ని చూడగానే శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. భోరున విలపించడంతో ఆమెను ఓదార్చేందుకు కుటుంబీకులు తీవ్రంగా ప్రయత్నించారు. భర్త మృతదేహం పక్కనే విలపిస్తూ అలాగే ఆమె రాత్రంతా కూర్చున్నారు. ఉదయం సైతం ఎక్కువ సమయంలో మృతదేహం పక్కనే ఆమె కూర్చుని ఉన్నారు.
అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు పెద్దఎత్తున తరలిరావడంతో ఆ పరిసరాలు విషాదంలో మునిగాయి. చిన్నమ్మకు పలు పార్టీలకు చెందిన నేతలు తమ సానుభూతి తెలియజేశారు. సాయంత్రం విలార్ నుంచి తంజావూరులో గతంలో నటరాజన్ నిర్మించిన ముల్లైవాయికాల్ స్మారక ప్రదేశానికి ఊరేగింపుగా మృతదేహాన్ని తీసుకెళ్లారు. శ్రీలంకలో సాగిన మారణహోమంలో అమాయక తమిళులు వేలాది మంది అశువులు బాయడాన్ని స్మరిస్తూ ఈ స్తూపాన్ని ఆయన గతంలో నిర్మించారు. ఆ స్తూపం వద్దే ద్రవిడ సంప్రదాయ పద్ధతిలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. అంతిమయాత్రలో వేలాదిగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు తరలివచ్చాయి. సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. కాగా, చిన్నమ్మ శశికళను పరామర్శించి, సానుభూతి తెలియజేయడానికి పెద్ద సంఖ్య అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు తంజావూరుకు తరలి వస్తున్నాయి. అయితే, అన్నాడీఎంకేకు చెందిన ఏ ఒక్కరూ అటు వైపు వెళ్ల లేదు. ఈ విషయంగా మంత్రి జయకుమార్ పేర్కొంటూ, వారు అమ్మ ద్రోహులు అని, వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ఇక, మక్కల్ మున్నేట్ర కళగం నేత తంగ తమిళ్ సెల్వన్ పేర్కొంటూ, అన్నాడీఎంకేకి చెందిన ఎంపీ చిన్నమ్మ పెరోల్‌కు సాక్షి సంతకం పెట్టారని వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment