తలాక్‌పై ఉపరాష్ట్రపతి సతీమణి కీలక వ్యాఖ్యలు
అలీగఢ్: దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌పై తీవ్ర చర్చలు జరుగుతుండగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ భార్య సల్మా అన్సారీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడుసార్లు తలాక్ అని చెప్పినంత మాత్రానా అది విడాకులుగా భావించరాదని చెప్పారు. 'ఒకరు తలాక్ తలాక్ తలాక్ అన్నంత మాత్రాన అది విడాకులు కాబోదు. ముస్లిం మహిళలకు ఈ సందర్భంగా ఓ విషయం చెబుతున్నాను. ఖురాన్ చదవండి. ముస్లిం మత పెద్దలు చెప్పేవాటినే పాటించడం కాకుండా ఖురాన్ చదివితే అందులో అసలు ఏముందనేది తెలుస్తోంది. చాలా మంది ముస్లిం మతపెద్దలు వారి భావాలే చెబుతుంటారు' అని కూడా సల్మా చెప్పారు.
'మౌలానాలు ఏం చెప్పిన మీరు నిజం అనుకుంటారు. అరబిక్‌లో ఉన్న ఖురాన్‌ను చదవండి. అనువాదాలను కాదు. అప్పుడే షారియత్ ఏం చెబుతోందో స్పష్టంగా తెలుస్తుంది. ఎవరో చెప్పినదానిని గుడ్డిగా పాటించడం కాదు' అని ఆమె వ్యాఖ్యానించారు. అలీఘడ్‌లోని అల్ నూర్ చారిటబుల్ సొసైటీ చాచా నెహ్రూ మదర్సాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.