ఎస్బీఐ ఉద్యోగి ఉరేసుకున్నాడు
అహ్మదాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం డబ్బుకోసం క్యూలో నిల్చున్నవారినే కాదు.. బ్యాంకు ఉద్యోగులను కూడా బలితీసుకుంది. గుజరాత్ లో మరో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశ్రాంతి లేకుండా గత కొద్ది రోజులుగా బ్యాంకు పనుల్లో తలమునకలైపోవడంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వృత్తిలో ఒత్తిడికారణంగానే అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అతడి భార్య తెలిపింది.
గుజరాత్‌లోని థారడ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ప్రేమ్ శంకర్ ప్రజాపతి అనే వ్యక్తి క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పెద్ద నోట్ల రద్దు కారణంగా గత కొద్ది రోజులుగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఆయన ఆదివారం సాయంత్రం ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయాడు. ఇతడి సొంత ప్రాంతం రాజస్థాన్ లోని బార్మర్ అనే ప్రాంతం. గత కొద్ది రోజులుగా బ్యాంకు వెళ్లొస్తున్న తన భర్త విచారంతో ఉంటున్నాడని, ఒత్తిడి కారణంగా ఇంట్లో వాళ్లతో మాట కూడా మాట్లాడకుండా ముభావంగా ఉండిపోతున్నారని ప్రజాపతి భార్య చెప్పింది. వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్పారు.