
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈరోజే నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు స్పీకర్‌ను కలవాల్సిందిగా రెబల్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా వీరంతా స్పీకర్‌ను కలిసే సమయంలో భద్రత కల్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రేపటిలోగా స్పీకర్ తన నిర్ణయాన్ని తెలియజేయాలని పేర్కొంది.
కాగా శాసనసభ స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది రోహత్గి కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో గురువారం అత్యవసరంగా పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.
Comments
Please login to add a commentAdd a comment