న్యూఢిల్లీ : కేరళలో వరద బీభత్సం కొనసాగుతున్న నేపథ్యంలో ముళ్ల పెరియార్ డ్యామ్ వివాదంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మొండిగా ప్రవర్తించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముళ్లపెరియార్ డ్యామ్ ఎత్తు 142 అడుగులు కాగా.. బుధవారం మధ్యాహ్నానికే నీటి మట్టం142 అడుగులకు చేరుకుంది. దీంతో కేరళలోని 14 జిల్లాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేరళ- తమిళనాడు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీని ఆదేశించింది.
నీటి మట్టం 139 అడుగులకు తగ్గించండి..
కేరళలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల గురించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ ముళ్లపెరియార్ డ్యామ్ నీటి మట్టాన్ని 139 అడుగులకు తగ్గించండి. అప్పుడే కేరళ ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా ఉంటారు. శుక్రవారం ఉదయం తమిళనాడు, కేరళ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయండి. వారు అందుబాటులో లేనట్లయితే కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా వారితో మాట్లాడేందుకు ప్రయత్నించండి అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా వివాదాస్పద ముళ్లపెరియార్ డ్యామ్ నిర్వహణ తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం నడుస్తోంది. ప్రస్తుతం కేరళలో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద వస్తుండటంతో డ్యామ్ సామర్థ్యాన్ని మించి నీటిమట్టం పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment