న్యూఢిల్లీ: ‘ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న వ్యక్తులు పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు రూల్ ఆఫ్ లా (సమ న్యాయపాలన)ను అతిక్రమించినట్లే. ఆ వ్యాఖ్యలు సెన్సార్ బోర్డు నిర్ణయంపైనా ప్రతికూల ప్రభావం చూపే వీలుంది’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీపికా పదుకోన్ ముఖ్యపాత్రలో నటించిన పద్మావతి చిత్రాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి.
చిత్రానికి వ్యతిరేకంగా సీఎంలు, రాజకీయ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలతో రూల్ ఆఫ్ లా నియమాలను అతిక్రమించినట్లేనని, ఈ విషయాన్ని సదరు వ్యక్తులకు తెలియజేయాలని అదనపు సొలిసిటర్స్ జనరల్ మనిందర్, పీఎస్ నరసింహాలను ఆదేశించింది. ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌ఎసీ) ముందు సినిమా పెండింగ్‌లో ఉంది.
ఈసమయంలో సీబీఎఫ్‌ఎసీ తన సర్టిఫికెట్ ఇవ్వాలో, వద్దో ప్రజాక్షేత్రంలో ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న వారు ఎలా చెబుతారు. ఇది సీబీఎఫ్‌సీ నిర్ణయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.’ అని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. విదేశాల్లో పద్మావతి సినిమాను విడుదల చేయకుండా చిత్ర నిర్మాతలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన తాజా పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌ల ధర్మాసనం కొట్టివేసింది.
సీబీఎఫ్‌సీ నిష్పాక్షిక నిర్ణయం తీసుకోవాలి
‘సీబీఎఫ్‌సీ తమ చట్టపరమైన బాధ్యతను నిర్వర్తిస్తుందనే ఉద్దేశంతో కోర్టులు బోర్డుపై ఎలాంటి పర్యవేక్షణ ఉంచవు. అలాగే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి’ అని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ ఇవ్వడంపై సీబీఎఫ్‌సీ అత్యంత నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రయత్నించడం, సినిమాటోగ్రఫీ చట్ట ఉల్లంఘన తదితర నేరాలపై దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, ఇతర వ్యక్తులపై కేసు నమోదు చేసేలా సీబీఐని ధర్మాసనం ఆదేశించాలని న్యాయవాది ఎంఎల్ శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ధర్మాసనం.. అందులో అభ్యంతరకర విషయాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఆదేశించింది. కోర్టులో శర్మ న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనపై ఎలాంటి జరిమానా విధించడం లేదని చెప్పింది. సినిమాను డిసెంబర్ 1న విడుదల చేసే ఉద్దేశం తమకు లేదని చిత్ర నిర్మాతల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, శ్యామ్ దివాన్ కోర్టుకు తెలిపారు.
స్పష్టత కావాలి: నితీశ్
వివాదం ముగిసే వరకు ‘పద్మావతి’ విడుదలకు అనుమతించబోమని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. చిత్ర నిర్మాత, దర్శకుడు, సినిమాతో సంబంధం ఉన్న వారంతా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన ఏ విషయంలో స్పష్టత కోరుతున్నారో తెలపలేదు.
‘భన్సాలీకి పిలుపు’
పద్మావతి సినిమాపై నెలకొన్న వివా దంపై వివరణ ఇచ్చేందుకు పార్లమెంటరీ కమిటీ ముందు హాజరు కావాల్సిం దిగా చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషీని కోరినట్లు కమిటీ చైర్మన్ అనురాగ్ ఠాకూర్ తెలి పారు. అలాగే చిత్ర నిర్మాతలు, సమా చార, ప్రసార శాఖ అధికారులకు కూడా కమిటీ సమాచారమిచ్చింది. కమిటీ సమావేశం గురువారం జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment