భారత జాతిపిత మహాత్మా గాంధీ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ హత్య కేసుకు సంబంధించి ఎటువంటి పునర్విచారణ చేపట్టాల్సిన అవసరంగానీ, తీర్పును పునఃసమీక్షించాల్సిన ఆవశ్యకతగానీ లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ముంబైకి చెందిన పంకజ్ ఫడ్నిస్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు బుధవారం ధర్మాసనం స్పష్టం చేసింది. ‘జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రజల్లో కొత్త అనుమానాలు రేకెత్తించేందుకు మీరు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దోషులను గుర్తించి, ఉరిశిక్ష కూడా విధించారు. ఇక ఈ కేసు గురించి మళ్లీ ఎటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. తీర్పును సరిదిద్దాల్సిన అవసరమూ లేదు’ అని పిటిషనర్‌ను ఉద్దేశించి జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి అంశాల్లో సెంటిమెంట్లు, భావోద్వేగాలు పనికిరావని, చట్టపరంగానే వ్యవహరించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
ముంబైకి చెందిన అభినవ్ భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ ఫడ్నిస్.. గాంధీజీ హత్య కేసులో విదేశీ కుట్ర ఉందని, నాలుగో బుల్లెట్ గురించిన నిజాలు తెలియాలంటే పునర్విచారణ జరిపించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ‘కపూర్ కమిషన్-1969 నివేదిక ప్రకారం వినాయక దామోదర్ సావర్కర్‌పై పలువురు అసంబద్ధ, అసత్య వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా మరాఠా సమాజమంతా నిందించబడింది. కాబట్టి ఇటువంటి నిందలను తొలగించుకోవాలంటే ఈ కేసు పునర్విచారణ చేపట్టాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. గాంధీజీ హత్యకేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది అమరేంద్ర శరన్.. ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాలపై లోతుగా విచారించి, నిందితులకు శిక్ష విధించారని జనవరిలో సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment