
ప్రతీకాత్మకచిత్రం
నేవీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ వర్తింపచేయాలన్న సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : నేవీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని సర్వోన్నత న్యాయస్ధానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ లభించగా, ఇప్పుడు నేవీలోనూ మగువకు సరైన స్ధానం లభించింది. పురుషుల తరహాలోనే మహిళలు అదే సామర్థ్యంతో పనిచేస్తారని, వీరి పట్ల వివక్ష తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత నౌకాదళంలో పురుష, స్ర్తీ అధికారులను ఒకేలా చూడాలని ఆదేశించింది. నేవీలో పనిచేసే మహిళా అధికారులకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దేశం కోసం నేవీలో సేవలందిస్తున్న మహిళలకు శాశ్వత కమిషన్‌ను వర్తింపచేయకపోవడం అసంబద్ధమని స్పష్టం చేసింది. నేవీలో ప్రస్తుతం మహిళలను పది సంవత్సరాల పాటు స్వల్పకాలిక సేవలకే పరిమితం చేస్తుండగా వారిని రిటైర్ అయ్యే వరకూ సేవల్లో కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.కాగా ఆర్మీలో పనిచేసే మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ వర్తింప చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.