సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏప్రిల్ 8న విచారణకు చేపడతామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం చేపట్టాలని కొందరు పిటిషనర్లు లేవనెత్తడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లతో కూడిన సుప్రీం బెంచ్ వెల్లడించింది.
కాగా అంతకుముందు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, తాను రాజ్యాంగ ధర్మాసనం ఎదుట హాజరుకావాల్సి ఉందని చెబుతూ విచారణ వాయిదా వేయాలని సుప్రీం బెంచ్‌ను కేంద్రం తరపున వాదనలు విపిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. పిటిషనర్ల తరపున హాజరైన రాజీవ్ ధవన్ మార్చి 11న సుప్రీం ఉత్తర్వులను ప్రస్తావిస్తూ ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
ఆర్థిక ప్రాతిపదికన జనరల్ కేటగిరీకి రిజర్వేషన్లు వర్తింపచేయడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి లోబడి ఉండాలన్నారు. కాగా అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణను చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment