విజయ్ మాల్యాకు రూ. 10 లక్షల జరిమానా
ఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త, లిక్కర్ కింగ్ విజయ మాల్యాకు సుప్రీంకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫెరా నిబంధనలను అతిక్రమించిన కేసులో తనపై ఉన్న కేసును కొట్టేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో పాటు రూ. 10 లక్షల జరిమానా కూడా విధించింది. జస్టిస్ జేఎస్ ఖేకర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నిధుల సమీకరణలో మాల్యా ఫారిన్ ఎక్సేంజ్ రెగ్యులేషన్ చట్టాల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంలో అప్పీలు చేశారు. దీనికి సంబంధించి 1985లో జరిగిన ఒప్పంద వివరాలపై ఆయనను ప్రశ్నించాలంటూ ఈడీ సమన్లు జారీ కోరింది.
కాగా తన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోషన్ కోసం లండన్కు చెందిన బెంటెన్ ఫార్ములా లిమెటెడ్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో సుమారు రెండు లక్షల డాలర్లను అక్రమంగా చెల్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, అవేవీ వాస్తవం కాదని కింగ్‌ఫిషర్ కొట్టిపారేసింది. గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌లోని పెట్టుబడులను సహారా ఫోర్స్ ఇండియాలోకి తరలించినట్లు కూడా విజయ్ మాల్యాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.