
తాజ్‌మహల్ పరిరక్షణలో ఏఎస్‌ఐ తీరుపై మండిపడ్డ సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక తాజ్ మహల్ కట్టడాన్ని సంరక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) విఫలమైందని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌పై క్రిమి కీటకాలు ముసురుతున్నా దీన్ని నిరోధించేందుకు ఏఎస్‌ఐ సహా సంబంధిత అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని మండిపడింది. ఏఎస్‌ఐ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదని వ్యాఖ్యానించింది. తాజ్ పరిరక్షణకు ఏఎస్‌ఐ అవసరమా, కాదా అనేది కేంద్రం నిర్ధారించాలని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ నాద్‌కర్ణితో పేర్కొంది.
తాజ్‌మహల్ సంరక్షణ కోసం అంతర్జాతీయ నిపుణుల నియామకంపై సుప్రీం కోర్టు చేసిన సూచనలను పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని నాద్‌కర్ణి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. యమునా నదిలో నీటి కొరత కారణంగానే క్రిమికీటకాల సమస్య తలెత్తిందని ఏఎస్‌ఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు.కాగా తాజ్‌మహల్ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ విజన్ డాక్యుమెంట్ ముసాయిదాను సమర్పించాలని ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1631లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ స్మృతిచిహ్నంగా నిర్మించిన ఈ చారిత్రక కట్టడం పరిరక్షణకు చేపడుతున్న చర్యలను సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment