న్యూఢిల్లీ: అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్‌ఆర్‌సీ) ముసాయిదా జాబితాలో స్థానం పొందిన వారిలో 10% పౌరుల వివరాలను శాంపిల్‌గా తీసుకుని మళ్లీ పరిశీలించాలన్న ప్రతిపాదనకు తాము సుముఖమేనని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. ఆ పునః పరిశీలన కార్యక్రమం ఒక స్వతంత్ర బృందం ద్వారా జరపాలని సూచించింది. ఎన్‌ఆర్‌సీ జాబితా రూపకల్పనలో ఎలాంటి తప్పులు చోటు చేసుకోలేదని తాము భావించేందుకే ఈ కసరత్తని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌ల ధర్మాసనం పేర్కొంది.
ఒక జిల్లా పౌరుల వివరాలను వేరే జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌సీ సేవాకేంద్రాల అధికారులు పునః పరిశీలించాలని సూచించింది. ఈ కసరత్తు ప్రారంభించడానికి, అలాగే, ముగించడానికి ఎంత సమయం పడ్తుందో తెలియజేయాలని రాష్ట్ర ఎన్‌ఆర్‌సీ కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలాను ఆదేశించింది. జిల్లాల వారీగా ఎన్‌ఆర్‌సీలో చోటు సంపాదించని వారి వివరాలకు సంబంధించి హజేలా సమర్పించిన నివేదికను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
అలాగే, అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి కేంద్రం రూపొందించిన నిబంధనల్లో లోపాలున్నాయని పేర్కొంటూ.. అభ్యంతరాల స్వీకరణకు ఉద్దేశించిన ఆగస్ట్ 30వ తేదీని కూడా ధర్మాసనం వాయిదా వేసింది. జాబితాలో చోటు పొందని పౌరులకు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రాలను తాజాగా సమర్పించుకునే అవకాశం ఇస్తే తలెత్తే పరిణామాలపై సీల్డ్ కవర్‌లో ఒక నివేదిక ఇవ్వాలని అస్సాం ఎన్‌ఆర్‌సీ కో ఆర్డినేటర్‌ను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment