విదేశీ చెత్తకు అనుమతి ఎలా?
ప్రజారోగ్యం పణంగా పెట్టి ధనార్జనా: కేంద్రంపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: విదేశాలు ప్రమాదకర వ్యర్థాలను మన దేశంలో పారవేసేందుకు అనుమతించి, అందుకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం డబ్బు తీసుకోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ పౌరుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రభుత్వం డబ్బు సంపాదిస్తోందని కోర్టు విమర్శించింది. విదేశాలు ప్రమాదకర వ్యర్థాలను మన దేశంలో పడేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారనీ, దీనివల్ల దేశ పౌరులపై దుష్ప్రభావాలు పడుతున్నాయని ‘రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ ’అనే స్వచ్ఛంద సంస్థ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై సుప్రీంకోర్టు అనేకసార్లు ఆదేశాలిచ్చినా అధికారులు అమలు చేయడం లేదనీ, కలుషిత పదార్థాలను భారత్‌లో పారవేసేందుకు అనుమతిస్తుండటంతో పౌరుల ఆరోగ్యం దెబ్బతింటోందని కోర్టుకు చెప్పారు.
ఇది చాలా ముఖ్యమైన అంశమనీ, అధికారులు నిబంధనలను అతిక్రమించకూడదని జస్టిస్ జేఎస్ ఖేహర్ అన్నారు. సమగ్ర వివరాలతో ఒక అఫిడవిట్‌ను సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 31కి వాయిదా వేసింది. గతంలో అలస్కా ఆయిల్ లీకేజీ(1989)తో సంబంధం ఉన్న ఓడను గుజరాత్ తీరంలో నాశనం చేయడానికి ప్రయత్నించగా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదు.