సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో నివాస ప్రాంతాల సమీపంలో మైక్‌లు, లౌడ్‌స్పీకర్ల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, ర్యాలీల కంటే పరీక్షలు ముఖ్యమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. నివాస ప్రాంతాల్లో మైక్‌లు, లౌడ్‌స్పీకర్ల వాడకంపై బెంగాల్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు.. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన పరీక్షలకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
బెంగాల్ ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, ఇది విద్యార్థులు పరీక్షలు రాసే సమయమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ అన్నారు. కాగా, పరీక్షలు ముఖ్యమేనని.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాము (రాజకీయ పార్టీలు) ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం తోసిపుచ్చలేనిదని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. అయినప్పటికీ విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీసే మైక్‌లు, లౌడ్‌స్పీకర్ల వాడకంపై నిషేధం ఎత్తివేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment