
సాక్షి, న్యూఢిల్లీ : కేసులో కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తిదే తుది నిర్ణయమని, ఇందులో కొలీజియం జోక్యానికి తావులేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. కేసుల కేటాయింపులో ఇతరుల జోక్యం సర్వోన్నత న్యాయస్థానం రోజు వారీ విధులను సంక్లిష్టం చేస్తుందని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ప్రజల మనసులో న్యాయవ్యవస్థ పట్ల గౌరవం సడలిపోవడం సర్వోన్నత న్యాయస్ధానం స్వతంత్రకు పెనుముప్పు వాటిల్లుతుందని జస్టిస్ ఏకే సిక్రీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా తీర్పులు వెలువరించినా కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తికే విచక్షణాధికారం ఉంటుందని పేర్కొన్నారు.
సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్ తన పిటిషన్‌లో ప్రధాన న్యాయమూర్తి మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా వ్యవహరించడాన్ని ప్రశ్నిస్తూ కేసుల కేటాయింపులో కొలీజియం లేదా పూర్తిస్ధాయి న్యాయస్ధానం కీలకంగా వ్యవహరించేలా ఆదేశించాలని కోరారు. అయితే సుప్రీం తీర్పుపై శాంతిభూషణ్ తరపున వాదించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు.
కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారని సుప్రీం కోర్టు నేటి తీర్పులో స్పష్టం చేసిందని, అయితే కేసుల కేటాయింపులో సీజేఐ తీరును బాహాటంగా విమర్శిస్తూ ఇటీవల నలుగురు సుప్రీం న్యాయమూర్తులు చేసిన ప్రకటన నేపథ్యంలో కోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రధాన న్యాయమూర్తి తన అధికారాలను దుర్వినియోగం చేయడంపై సుప్రీం కోర్టు ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గతంలో జస్టిస్ లోయా మృతి, మెడికల్ కాలేజ్ కుంభకోణం వంటి సున్నితమైన కేసుల కేటాయింపులో సీజేఐ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నలుగురు సుప్రీం న్యాయమూర్తులు బాహాటంగా విమర్శించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment