కార్తీకి సుప్రీంలో చుక్కెదురు
► సీబీఐ విచారణకు హాజరవకుండా విదేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు
► లుకౌట్ నోటీసుల అంశంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసుల్లో సీబీఐ విచారణకు హాజరు కాకుండా విదేశాలకు వెళ్లవద్దని కోర్టు ఆదేశించింది. అలాగే కార్తీపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లుకౌట్ నోటీసుల్ని నిలిపివేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ‘అతను దోషి అవునా.. కాదా! అన్న అంశం జోలికి మేం పోలేదు. కార్తీ విచారణకు హాజరై సహకరిస్తాడా? లేదా? అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నాం.
విచారణకు హాజరుకావాలని సీబీఐ కోరింది. మీరు హాజరు కాలేదు. మొదట విదేశాల్లో ఉన్నానని చెప్పారు. అక్కడి నుంచి వచ్చాక కూడా విచారణకు సహకరించలేదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. విచారణకు హాజరై కార్తీ తన విశ్వసనీయతను నిరూపించుకోవాలంది. కార్తీ తరఫు న్యాయవాది గోపాల్ సుబ్రమ ణియంపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపిం చింది. ‘కార్తీ అరెస్టుకు ఎలాంటి ఉత్తర్వులు లేవు. అతన్ని అరెస్టు చేసే ఆలోచన కూడా లేదు.
అయినా విచారణకు ఎందుకు దూరం గా ఉన్నారు.? అలాగే ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని మాత్రమే మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తారు. కానీ మీరు అలా చేయలేదు. అంటే అరెస్టు గురించి మీరు భయపడడం లేదు’ అని పేర్కొంది. విచా రణకు ఎప్పుడు హాజరవుతారో సమయం తెలపాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో కార్తీకి, మరో నలుగురికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది.
విదేశాలకు అనుమతిలో...
కక్షిదారు నుంచి వివరాలు తీసుకుని కోర్టుకు సమర్పిస్తానని, అదే సమయంలో కార్తీ రక్షణ విషయంలో సుప్రీంకోర్టు భరోసా ఇవ్వాలని సుబ్రమణియమ్ కోరారు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ‘కొందరు ప్రముఖ వ్యక్తులకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి విషయంలో కోర్టుకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. వెళ్లిన వారు ఇంకా తిరిగి రాలేదు’ అని పేర్కొంది.
ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసును ఉదహరిస్తూ.. మలేసియా వెళ్లేందుకు అనుమతించిన వ్యక్తులు తిరిగి రాలేదని ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా కార్తీ, ఇతరులపై జారీ చేసిన లుకౌట్ నోటీసులపై మద్రాసు హైకోర్టు ఉత్తర్వుల్ని నిలిపివేస్తూ.. ఎఫ్‌ఐఆర్ రద్దు పిటిషన్‌ను చట్ట పరిధికి లోబడి పరిష్కరించాలని సూచించింది. ఎఫ్‌ఐఆర్ రద్దు పిటిషన్‌పై తుది ఉత్తర్వుల కోసం కార్తీ ప్రయత్నాలు కొనసాగించాలని, ఒకవేళ అత ను విజయం సాధిస్తే విచారణను నిలిపి వేస్తామని సుప్రీం తెలిపింది. అయినా అతను విదేశాలకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.