
బాలికపై గ్యాంగ్ రేప్, అనంతరం హత్య
అలీఘర్ : ఉత్తర్ ప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దారుణ కాండ ఘటన ఇంకా మరువక ముందే... 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హర్దాగంజ్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. బుధవారం సాయంత్రం ఆమె ట్యూషన్ ముగించుకుని సైకిల్పై ఇంటికి వస్తుండగా మోటార్ బైక్లపై వచ్చిన నలుగురు దుండగులు అడ్డగించారు.
అనంతరం ఆమెను సమీపంలోని చెరుకు తోటలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి బాలిక దుప్పట్టతో ఉరివేసి హతమార్చారు. బాలిక మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే ఈ దుర్ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించేందుకు నిరాకరించారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నలుగురి పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాగా ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుగుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టామని సీనియర్ పోలీస్ అధికారి రవీందర్ గౌడ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించామని, నివేదిక అనంతరం బాలిక మృతిపై వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ ఎవని అరెస్ట్ చేయలేదని, కేవలం అదుపులోకి తీసుకున్నారని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు.