లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్
న్యూఢిల్లీ: దేశద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. అయితే అందరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ఒక అభిప్రాయానికి రావడం మాత్రం జరగదన్నారు. మంగళవారం ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఐపీసీ 124 ఎ (దేశద్రోహం) చట్టంలో ఉన్న ఇబ్బందులేంటి, ఎందుకు పునఃపరిశీలించాలి, నిర్వచనాన్ని మార్చాల్సిన అవసరం ఉందా తదితర విషయాలపై అందరి అభిప్రాయాలు తీసుకుని, క్రిమినల్ లాయర్లను సంప్రదించి ఒక నివేదిక రూపొందిస్తామని తెలిపారు.
ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్ట్ యాక్ట్ (ఈఏ) చట్టాలను పునఃపరిశీలించిన తర్వాత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థపై ఒక సమగ్ర నివేదిక రూపొందిస్తామని తెలిపారు. ద్వేషపూరిత ప్రసంగం, సహజీవనం, బాధితుల హక్కులు, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థపై సమగ్ర సమీక్ష తదితర అంశాలు పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం తమను కోరిందని, ఒకదాని తర్వాత మరో అంశాన్ని చేపడతామని 21వ కమిషన్ చైర్మన్ జస్టిస్ చౌహాన్ తెలిపారు. అయితే జస్టిస్ ఏపీ షా చైర్మన్‌గా ఉన్న 20వ కమిషన్ ముందే ఈ దేశద్రోహం పరిశీలన అంశం ఉన్నా.. ఆ కమిషన్ రిపోర్టు నివ్వలేదు. ఇప్పుడు జేఎన్‌యూ వ్యవహారంతో ఈ చట్టంపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి సమీక్ష అంశం తెరపైకి వచ్చింది.