పాల్వాయి కన్నుమూత
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో గుండెపోటుతో తుదిశ్వాస
పేరు : పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, పుట్టినతేదీ : 20 నవంబర్ 1936, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట తాలూకా నడింపల్లి, తల్లిదండ్రులు : పాల్వాయి రంగారెడ్డి–అనసూయమ్మ, భార్య : శ్రుజమణి, పిల్లలు : శ్రావణ్‌కుమార్‌రెడ్డి, స్రవంతి, శాంతన్‌కుమార్‌రెడ్డి, (శంతన్ అపోలో ఆస్పత్రిలో సర్జన్‌గా పని చేస్తున్నారు. శ్రావణ్ ఇడికుడ సర్పంచ్‌గా ఉన్నారు), స్వస్థలం : చండూరు మండలం ఇడికుడ గ్రామం, విద్యాభ్యాసం : మర్రిగూడ మండలం శివన్నగూడెం, దేవరకొండ మండలంలో 6వ తరగతి వరకు, ఆ తర్వాత 10 వరకు హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్‌లో.. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కళాశాలలో పూర్తిచేశారు.
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్, చండూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (80) శుక్రవారం కన్నుమూశారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి సహచర ఎంపీలతో కలసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూకు వెళ్లిన ఆయన.. అక్కడ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు.
ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. ముక్కుసూటి స్వభావమున్న నేతగా పేరుపొందిన పాల్వాయిది ఐదున్నర దశాబ్దాల రాజకీయ జీవితం. నెహ్రూ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. 1967లోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా, ఎమ్మెల్సీ గా, రాజసభ సభ్యుడిగా పనిచేశారు. తొలి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పోరాడి.. జైలుకు వెళ్లారు. పాల్వాయి మృతిపట్ల ప్రధాని మోదీ, సోనియా సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఆయాసంతో బాధపడుతూ..
శుక్రవారం హిమాచల్‌లోని కులూలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖకు సంబంధించిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్వాయి పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భార్య శ్రుజమణి, మనవరాలు, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితర ఎంపీలతో కలసి పాల్వాయి బయలుదేరారు. విమానం ఎక్కేముందు ఆయన తీవ్రంగా ఆయాసంతో బాధపడ్డారు. ఇలా ఆయాసం రావడం, మోకాలు నొప్పి కూడా ఉండడంతో పాల్వాయిని విమాన సిబ్బంది వీల్ చైర్ సహాయంతో విమానం ఎక్కించారు. గంటసేపు ప్రయాణం అనంతరం విమానం కులూకు చేరుకుంది.
అక్కడ విమానం దిగగానే పాల్వాయి గుండెపోటుకు గురయ్యారు. ఛాతీలో బిగపట్టినట్టుగా ఉందని చెప్పడంతో ఆ బృందంలోనే ఉన్న ఒక వైద్యుడు పరీక్షించి.. ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వెంటనే విమానాశ్రయంలోని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే తుదిశ్వాస విడిచారని వైద్యులు నిర్ధారించారు. పాల్వాయిని అంబులెన్స్‌లోకి ఎక్కించిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు.. వెనక మరో కారులో ఆస్పత్రికి బయలుదేరారు. కానీ వారు ఆస్పత్రికి చేరుకొనేలోగానే పాల్వాయి మరణ సమాచారం అందింది. అప్పటిదాకా తమ మధ్యే ఉండి, తమతో మాట్లాడిన పాల్వాయి అంతలోనే కన్నుమూశారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పాల్వాయితో పాటు విమానంలో కులూ కు ప్రయాణించిన ఆయన.. ఆ సంఘటనను బాధతో మీడియాతో పంచుకున్నారు.
ఢిల్లీకి భౌతికకాయం
కులూలో మృతిచెందిన పాల్వాయి భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. తెలంగాణ ప్రభుత్వం, హిమాచల్ ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేశాయి. రాహుల్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ హిమాచల్ సీఎం వీరభద్రసింగ్‌తో మాట్లాడారు. అటు సీఎం కేసీఆర్ కూడా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేసి హిమాచల్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఢిల్లీలోని జీఆర్‌జీ రోడ్డులో ఉన్న పాల్వాయి అధికారిక నివాసానికి భౌతికకాయాన్ని తరలించి ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పాల్వాయి స్వగృహానికి తరలించారు.
నేడు ఇడికుడలో అంత్యక్రియలు
పాల్వాయి భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం శనివారం ఉదయం గాంధీభవన్‌లో ఉంచనున్నట్టు ఉత్తమ్ తెలిపారు. అనంతరం పాల్వాయి స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడకు తరలించనున్నట్లు చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు పాల్వాయి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రైతుల సంక్షేమం కోసం ఎనలేని కృషి
‘‘తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం పా ల్వాయి అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన సేవలు మరువలేనివి. తనతో కలసి పనిచేసిన వారందరూ ఆయన్ను ప్రతిక్షణం గుర్తుంచుకుం టారు..’’ – ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ
ఇది బాధాకరం..
‘‘పాల్వాయి హఠాన్మరణం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా..’’ – ప్రధాని మోదీ
ఆయన జీవితం ప్రజలకు అంకితం
‘‘గౌరవప్రదమైన నాయకుడిగా ఎదిగిన గోవర్ధన్‌రెడ్డి తన జీవితాన్ని ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి అంకితమిచ్చారు. శ్లాఘించదగిన వారసత్వాన్ని వదిలివెళ్లారు. ఆయన మరణం జాతికి, కాంగ్రెస్‌కు తీరని లోటు.. – సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ
తీరని లోటు..
‘‘పాల్వాయి హఠాన్మరణం తీరని లోటు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఆయనతో నాకు ఎంతో అనుబంధం ఉంది’’ – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
పాల్వాయి సేవలు మరువలేనివి
‘‘పాల్వాయి ఆకస్మిక మృతి దిగ్భాంతి కలిగించింది. కాంగ్రెస్ సీనియర్ నేతగా, ప్రజాప్రతినిధిగా ఆయన మరువలేని సేవలు అందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా..’’ – వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
ఢిల్లీలో ప్రముఖుల నివాళి..
ఢిల్లీలో పాల్వాయి భౌతికకాయాన్ని ఉప రాష్ట్ర పతి హమీద్ అన్సారీ, మన్మోహన్, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి అహ్లూవాలి యా, ఏకే ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్, సురవరం సుధాకర్‌రెడ్డి, ఉత్తమ్, కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి సందర్శించి నివాళులు అర్పించారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.