కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం భట్పారా ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్ వద్ద జై శ్రీరాం నినాదాలు చేసిన ఏడుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఫలితాల అనంతరం పార్టీ కార్యకర్తలపై దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నైహతి వెళుతున్న దీదీ కాన్వాయ్ వద్ద గుమికూడిన కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. భట్పారా ప్రాంతం మీదుగా మమతా బెనర్జీ వాహన శ్రేణి వెళుతుండగా కొందరు జై శ్రీరాం నినాదాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జై శ్రీరాం నినాదాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన వాహనం నుంచి బయటకు వచ్చిన దీదీ నినాదాలు చేసిన వారి పేర్లు రాసుకోవాలని అధికారులకు సూచించారు. దుండగుల వైపు దూసుకొచ్చిన ఆమె ‘అసలు మీ గురించి మీరేం అనుకుంటున్నారు..ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్నే దూషిస్తారా..? ఇలాంటి వాటిని నేను సహించను..నన్ను దూషించేందుకు మీకెంత ధైర్యం’ అంటూ ఆమె మండిపడ్డారు.
ఇక మమతా బెనర్జీ తిరిగి తన వాహనంలో కూర్చుని ముందుకు కదిలిన తర్వాతా వారు తిరిగి జై శ్రీరాం నినాదాలు చేశారు. మరోవైపు ఎన్నికల ప్రచారం సందర్భంగా పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోనూ మమతా కాన్వాయ్ వెళుతుండగా కొందరు జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment