sloganeering
-
దీదీ ముందు జై శ్రీరాం నినాదాలు : ఏడుగురి అరెస్ట్
కోల్కతా : లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం భట్పారా ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్ వద్ద జై శ్రీరాం నినాదాలు చేసిన ఏడుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఫలితాల అనంతరం పార్టీ కార్యకర్తలపై దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నైహతి వెళుతున్న దీదీ కాన్వాయ్ వద్ద గుమికూడిన కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. భట్పారా ప్రాంతం మీదుగా మమతా బెనర్జీ వాహన శ్రేణి వెళుతుండగా కొందరు జై శ్రీరాం నినాదాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జై శ్రీరాం నినాదాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన వాహనం నుంచి బయటకు వచ్చిన దీదీ నినాదాలు చేసిన వారి పేర్లు రాసుకోవాలని అధికారులకు సూచించారు. దుండగుల వైపు దూసుకొచ్చిన ఆమె ‘అసలు మీ గురించి మీరేం అనుకుంటున్నారు..ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్నే దూషిస్తారా..? ఇలాంటి వాటిని నేను సహించను..నన్ను దూషించేందుకు మీకెంత ధైర్యం’ అంటూ ఆమె మండిపడ్డారు. ఇక మమతా బెనర్జీ తిరిగి తన వాహనంలో కూర్చుని ముందుకు కదిలిన తర్వాతా వారు తిరిగి జై శ్రీరాం నినాదాలు చేశారు. మరోవైపు ఎన్నికల ప్రచారం సందర్భంగా పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోనూ మమతా కాన్వాయ్ వెళుతుండగా కొందరు జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించిన సంగతి తెలిసిందే. -
హిందూ సన్యాసులందరూ జాతి వ్యతిరేకులే
పట్నా: విదాస్పద బిహార్ నేత, మధేపురా ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి రాజకీయ నాయకులు, అధికారులను ఎవరైనా కొట్టి చంపితే వారికి రూ. 10 లక్షలు నజరానా ఇస్తానని ప్రకటించిన ఆయన ఈ సారి తన మాటల యుద్ధాన్ని హిందు సాధువులు, సన్యాసులపై ఎక్కుపెట్టారు. హిందూ సన్యాసులందరూ జాతి వ్యతిరేకులే అంటూ వివాదాన్ని రగిలించారు. దీంతోపాటుగా జాతి వ్యతిరేక నినాదాలు చేయడం, జమ్ము కశ్మీర్ లో జాతీయ పతాకాన్ని తగుల బెట్టడం తప్పుకాదని వ్యాఖ్యానించి రాజేశ్ రంజన్ మరో వివాదానికి తెరలేపారు. బిహార్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన పప్పూ హిందూ సన్యాసులు, సాధువులపై ధ్వజమెత్తారు. హిందూ సాధువులందరూ జాతి వ్యతిరేకులనీ, అందుకే పేదలు దేవాలయాలకు వెళ్లడం మానుకోవాలని పిలుపునిచ్చారు. వారి దోపిడీ దౌర్జన్యాల నుంచి కాపాడుకునేందుకు పేదలు గుళ్లకు వెళ్లకుండా వుండాలన్నారు. కాగా అయిదుసార్లు ఎంపీగా గెలిచిన పప్పూ యాదవ్ పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటు సౌపాల్ నియోజకవర్గం నుంచి ఆయన భార్య రంజీత్ రంజన్ కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. లాలూతో విభేదించిన రాజేశ్ రంజన్ ఆర్జేడీ నుంచి బయటకొచ్చి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మధేపురా ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పప్పూ యాదవ్ జన అధికార పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.