మేఘాలయ గవర్నర్ రాసలీలలు!
విమర్శల వెల్లువ.. ఆపై రాజీనామా
► రాజ్‌భవన్ ను ‘యంగ్ లేడీస్ క్లబ్’గా మార్చారంటూ ఉద్యోగుల లేఖ
షిల్లాంగ్: మేఘాలయ గవర్నర్ వీ షణ్ముఖనాథన్ (67) గురువారం రాజీనామా చేశారు. రాజ్‌భవన్ ను యంగ్ లేడీస్ క్లబ్‌గా, తన రాసలీలల కేంద్రంగా మార్చారంటూ ఆ కార్యాలయ ఉద్యోగులు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రహోంమంత్రి, ముఖ్యమంత్రికి లేఖ రాయడం, షణ్ముఖనాథన్ వైఖరిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ షణ్ముఖనాథన్ రాజ్‌భవన్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, రాజ్‌భవన్ ను ‘యంగ్ లేడీస్ క్లబ్’గా మారుస్తున్నారని, సత్వరమే ఆయనకు ఉద్వాసన పలకాలని కోరుతూ దాదాపు వంద మంది రాజ్‌భవన్ ఉద్యోగులు రాష్ట్రపతి ప్రణబ్‌కు, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాకు లేఖ రాశారు.
‘రాజ్‌భవన్ కు యువతులు యథేచ్ఛగా వచ్చి వెళ్తుంటారు. వారిలో చాలా మంది గవర్నర్ బెడ్‌రూమ్‌లోపలి వరకు డైరెక్ట్‌గా వెళ్తుంటారు. గవర్నర్ ఇద్దరు ప్రజాసంబంధాల అధికారులను, ఒక కుక్‌ను, రాత్రి విధుల కోసం ఒక నర్స్‌ను ప్రత్యేకంగా నియమించుకున్నారు. వారంతా మహిళలే. తన దగ్గర విధులు నిర్వహించేందుకు యువతులను మాత్రమే నియమించుకున్నారు. అధికారిక ప్రైవేటు కార్యదర్శిని సైతం తన సెక్రటేరియట్‌కు బదిలీ చేశారు’ అని ఆ లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. గవర్నర్ వైఖరిపై మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు మండిపడ్డాయి.
రాజ్‌భవన్ కు ఉద్యోగం కోసం వెళ్లగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ షణ్ముఖనాథన్ పై ఒక యువతి గతంలో ఆరోపణలు కూడా చేశారు. 2015లో షణ్ముఖనాథన్ మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన షణ్ముఖనాథన్ గతంలో ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఉన్నారు.