శబరిమలలో మహిళల ప్రవేశానికి ఓకే
⇒ సుప్రీంకోర్టుకు నివేదించిన కేరళ ప్రభుత్వం
⇒ అన్ని వయసుల మహిళలు గర్భగుడిలోకి ప్రవేశించవచ్చు
⇒ ప్రభుత్వ వైఖరితో వ్యతిరేకించిన ట్రావెన్‌కోర్ బోర్డు
న్యూఢిల్లీ: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అన్ని వయసుల మహిళలు చారిత్రక శబరిమల ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం తరఫు న్యాయవాది సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. గత జూలైలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించడాన్ని సమర్థిస్తూ కేరళ ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్‌ను సమర్పించింది. అయితే తాజా విచారణ సందర్భంగా ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మద్దతుగా 2007లో తాము దాఖలు చేసిన అఫిడవిట్‌కు కట్టుబడి ఉన్నట్టు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
2007లో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్) నేతృత్వంలోని ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అరుుతే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యునెటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) ఈ నిర్ణయంతో విబేధించింది. ఈ ఏడాది అధికారాన్ని కోల్పోయే ముందు కూడా యూడీఎఫ్ ప్రభుత్వం పదేళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం విధించడాన్ని సమర్థిస్తూ అదనపు అఫిడవిట్‌ను సమర్పించింది. ‘శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమిటని వివరణ కోరాం. సీనియర్ న్యాయవాది గుప్తా కేరళ ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్‌కు కాకుండా 2007 నాటి ఒరిజినల్ అఫిడవిట్‌కే కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.
ఏ వయసు మహిళలైనా ఆలయంలోకి ప్రవేశించకుండా అనుమతి నిరాకరించబోమని తెలిపారు’’ అని న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే ట్రావెన్‌కోర్ దేశస్థాన బోర్డు తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలను సైతం ధర్మాసనం రికార్డు చేసుకుంది. బోర్డు తన వాదనలను వినిపిస్తూ ప్రభుత్వం తమ ఇష్టానుసారం వైఖరి మార్చుకోవడం తగదని పేర్కొంది. కాగా, వాదనలు విన్న న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరే చివరిది కాదని, లింగ సమానత్వానికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలతో పాటు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేసింది.