
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంతో సహా వివిధ మతపరమైన ప్రదేశాల్లో స్త్రీలపట్ల అనుసరిస్తోన్న వివక్షపై తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనం 10 రోజుల వ్యవధిలో విచారణ పూర్తిచేయనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. పరిష్కరించాల్సిన సమస్యలు చట్టబద్ధమైనవి కనుక విచారణను ముగించేందుకు ఎక్కువ సమయం పట్టదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఈ విచారణ పదిరోజులకు మించి పట్టదనీ, ఎవరైనా కావాలనుకున్నా అంతకు మించిన సమయమివ్వలేము’అని జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌ల బెంచ్ వెల్లడించింది.
బెంచ్ పరిగణనలోనికి తీసుకునే ప్రశ్నలను ఖరారు చేయలేదని సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా వెల్లడించారు. అయితే ఈ న్యాయసంబంధిత ప్రశ్నలను సుప్రీంకోర్టు తయారుచేయవచ్చునని లా ఆఫీసర్ తెలిపారు. ముస్లిం మహిళల మసీదు ప్రవేశం, దావూదీ బోహ్రా ముస్లిం సమాజంలో స్త్రీల జననేంద్రియాలను తొలగించడం, పార్శీ స్త్రీలు పార్శీయేతర పురుషులను వివాహమాడడం లాంటి పలు అంశాలను ధర్మాసనం పరిశీలించనుంది.