న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం, ముస్లిం, పార్సీ మతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలో 9 మంది జడ్జీలు ఈ నెల 13 నుంచి ఆయా వ్యవహారాలపై వాదనలు విననున్నారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఎం శంతనగౌడర్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ ఆర్‌ఎస్‌రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లు ఉన్నట్లు మంగళవారం వెల్లడించింది. శబరిమల అంశంపై గతంలో వాదనలు విన్న ఏ న్యాయమూర్తి ఇందులో లేకపోవడం గమనార్హం. అన్ని వయసుల వారిని శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ 2018లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ యువ న్యాయవాదుల అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment