శబరిమల: కేరళ చరిత్రాత్మక నిర్ణయం
శబరిమల: కేరళ చరిత్రాత్మక నిర్ణయం
Published Mon, Nov 7 2016 3:40 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రముఖమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం విషయంలో కేరళ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వయస్సుతోనిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సోమవారం వెల్లడించింది.
రుతుక్రమానికి లోనయ్యే 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను ఆలయ బోర్డు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం స్త్రీల పట్ల వివక్ష చూపడమేనంటూ దాఖలైన కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. గత విచారణ సందర్భంగా ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
‘దేవుణ్ణి పూజించడానికి ఫలానా భక్తులు మాత్రమే అర్హులని ఎక్కడైనా ఉంటుందా? అసలు దేవునికి భక్తుల విషయంలో తేడాలు ఉంటాయా? చిన్నాపెద్దా, కులం, మతంతోపాటు లింగబేధం కూడా ఉంటాయా?’ అని ప్రశ్నించింది. ‘ఏ విధానం ఆధారంగా ఆలయాలకు వెళ్లకుండా మహిళలను అడ్డుకుంటున్నారు? దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన దర్శనానికి స్త్రీ, పురుష వివక్ష ఏమిట’ని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహిళల ఆలయ ప్రవేశం విషయంలో సుప్రీంకోర్టుకు తన తాజా నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం తెలిపింది. కేరళ నిర్ణయాన్ని నమోదుచేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది. కాగా, అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సులకు చెందిన మహిళలను ప్రవేశం కల్పించాల్న కేరళ నిర్ణయంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Advertisement
Advertisement