షోలాపూర్, న్యూస్‌లైన్: ఏడుసార్లు లోక్‌సభకు, ఏడుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందిన తనకు పరాభవ భయమెక్కడిదని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. మోడీకి తన గురించి బాగానే భయం పట్టుకుందనీ, అందుకే ప్రతి బహిరంగ సభలో తన నామమే జపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారని మోడీపై పవార్ ఎదురుదాడికి దిగారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి పదవి ఆశించననీ ఇంతకు ముందే స్పష్టం చేశానన్నారు.
పరాభవం భయంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మోడీ ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి తాను ఏడు సార్లు లోక్‌సభ, ఏడు సార్లు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినట్లు మోడీకి తెలియక పోవచ్చని విమర్శించారు. ఒకవేళ పోటీ చేసినా బారామతి, మాడాలలోనే పోటీ చేసేవాడిననీ, ఈ రెండు చోట్ల ఎన్సీపీనే గెలుపొందిందని, అలాంటప్పుడు తనకు పరాభావ భయమేక్కడిది అని ప్రశ్నించారు.
మోడీకి పార్టీ వర్గాలు తప్పుడు సమాచారం అందించి ఉంటాయని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి ఒకే రాష్ట్రంలో 25 బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని, ఇంత సమయం ప్రచారానికి వెచ్చిస్తున్నారని, వేరే పని ఏమి లేదా? అని పవార్ ప్రశ్నించారు.
ఈ ఎన్నికల్లో ఎన్సీపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీపై తనకు గౌరవం ఉందని, వాస్తవంగా రాజకీయాలలో ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదనే అభిప్రాయంతోనే తాను విమర్శించడంలేదన్నారు. గుజరాత్ ‘వెస్’ మరాఠీ అలజడులకు మోడీ ప్రభుత్వం ఆజ్యం పోస్తోందని, దీనిని రాష్ట్ర ప్రజలు సహించబోర ని హెచ్చరించారు.
మోడీ.. మహారాష్ట్ర వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ మరాఠీయులను కించపరిచే విధంగా నడుచుకుంటూ, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేందుకు ఊతమిస్తున్నారని పవార్ ఆరోపించారు. రాష్ట్రంలోని డైమండ్ మార్కెట్‌ను గుజరాత్‌కు తరలించడం, ముంబై కోసం ‘సాగరి సురక్ష దళ్ శిక్షణ’ కేంద్రానికి ఆమోదం లభించినప్పటికీ ఆమోదాన్ని తోసిపుచ్చి గుజరాత్‌కు తీసుకు వెళ్లడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు.
మరాఠీయులు గుజరాత్‌లో అనేక ప్రాంతాలలో ఉంటూ అక్కడి వారితో మమేకమై ఉన్నారని, గుజరాతీయులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు కృషి చేశారన్నారు. మహారాష్ట్రకు వ్యతిరేకంగా కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటోందని, వీటి వల్లనే మరాఠీయులు వెస్ గుజరాతీయుల మధ్య వైరం పెరిగే అవకాశముందని పవార్ హెచ్చరించారు. సంఘ్ పరివార్.. బీజేపీల అజెండాను అమలు పరిచే దిశగా పావులు కదుపుతున్నారన్నారు. దసరా పర్వదినం సందర్భంగా సంఘ్ ప్రముఖుడి ప్రసంగాన్ని డీడీలో ప్రసారం చేశారని, అయితే బలహీన వర్గాల వారు దమ్మచక్ర పరివర్తన్‌ను నాగ్‌పూర్‌లో నిర్వహించినా దానిని డీడీలో ప్రసారం చేయలేదన్నారు. ఇలా వివక్ష చూపడం న్యాయం కాదని నిప్పులు చెరిగారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ప్రకటనలలో వాడుకుంటూ ఆయన పేరుతో ఓట్లు అడుక్కోవడం చట్టం ప్రకారం ఆమోదయోగ్యం కాదని కూడా పవార్ స్పష్టం చేశారు.
మోడీ విమర్శలపై పవార్ ఎదురుదాడి
ముంబై: రాష్ట్రంలో పలు ఎన్నికల సభల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనపై చేసిన విమర్శలను ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ తిప్పి కొట్టారు. ‘‘నా ఎన్నికల రికార్డు ఏమిటో ఆయనకు (మోడీ)కి చెప్పండి. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. నేను ఎన్నికలను తప్పించుకుంటానా?’’ అని సోమవారం మరాఠ్వాడా ప్రాంతంలోని అహ్మద్‌నగర్‌లో జరిగిన సభలో పవార్ ప్రశ్నించారు.
యూపీఏ నౌక మునుగుతోందని తెలిసే శరద్ పవార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులుగా రాజ్యసభను ఎంచుకున్నారని మోడీ విమర్శించారు. దీనిపై పవార్ స్పందిస్తూ, ప్రధాన మంత్రికి తాను తప్ప మరో నాయకుడు కనిపించకపోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. ‘‘ఎన్నికల సభల్లో మోడీ ఏం మాట్లాడారు? ఏదైనా జాతీయ ప్రయోజనాన్ని గూర్చి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. సామాన్య మానవుని జీవితాన్ని మారుస్తానని చెప్పినా బాగుండేది. కానీ ఆయన ప్రసంగాలు చూస్తే, గరిష్టంగా శరద్‌పవార్‌పైనే దాడి చేసినట్టుగా ఉన్నాయి’’ అని ఎన్సీపీ అధ్యక్షుడు పేర్కొన్నారు.
చవాన్ వల్లే సమస్యలు పరిష్కారం కాలేదు: అజిత్
సాక్షి, ముంబై: మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సహకారం లేకపోవడంవల్ల అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేక పోయాయని మాజీ ఉప ముఖ్యమంత్రి అజీత్ పవార్ ఆరోపించారు. ఔరంగాబాద్ జిల్లాలోని గంగాపూర్-ఖుల్తాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలో దిగిన ఎన్సీపీ అభ్యర్థి కృష్ణ పాటిల్ డోణ్‌గావ్కర్‌కు మద్దతుగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రచార సభలో అజిత్ పవార్ మాట్లాడారు.
కొన్ని కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులకు 75 శాతం గ్రాంట్లు, అన్ని పాఠశాలలను డిజిటల్ క్లాస్ రూమ్‌లుగా ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల మాదిరిగా కాకుండా తమ పార్టీకి కుల, మతాలు తెలియవని, అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ముందుకు సాగుతుందంటూ పరోక్షంగా శివసేనను కూడా విమర్శించారు.
నాకు ఓటమి భయమా?
Published Mon, Oct 6 2014 9:59 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement