Assembly elections in Maharashtra
-
నలుగురు తెలుగువారి జయకేతనం!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు తెలుగు అభ్యర్థులూ విజయం సాధించారు. వీరిలో ముగ్గురు విదర్భకు చెందిన బీజేపీ అభ్యర్థులే కావడం విశేషం. చంద్రాపూర్ జిల్లా బల్లార్షా నుంచి సుధీర్ మునగంటివార్, యావత్మాల్ జిల్లా యావత్మాల్ నుంచి బీజేపీ అభ్యర్థి మదన్ యేర్వార్, వనీ నుంచి బోద్కువార్ సంజీవరెడ్డి గెలిచారు. సుధీర్ కాంగ్రెస్ అభ్యర్థి ములచందానిపై నాలుగు వేలకుపైగా ఓట్లతో, మదన్ యేర్వార్ శివసేన అభ్యర్థి సంతోష్ డవలేపై స్వల్ప మెజార్టీతో, బోద్కువార్ సంజీవరెడ్డి ఆరు వేల ఓట్ల తేడాతో శివసేన అభ్యర్థి విశ్వాస్ నందేకర్పై విజయం సాధించారు. పశ్చిమగోదావరి జిల్లా అల్లుడైన ద్వారం మల్లికార్జున రెడ్డి కూడా నాగపూర్‌లోని రాంటెక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. గణపవరం మండలం ముప్పర్తిపాడుకు చెందిన చింతా సూర్యభాస్కరరెడ్డి అల్లుడైన మల్లికార్జున రెడ్డి కాంట్రాక్టరుగా మహారాష్ట్రలో ఉంటూ అంచెలంచెలుగా ఎదగడంతోపాటు, స్వచ్ఛంద సంఘాల సేవల ద్వారా మరాఠా ప్రజల మనసుల్ని గెలిచారు. మహారాష్ట్రలోని మొత్తం 15 మంది తెలుగు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. సంపన్న మహిళ సావిత్రి జిందాల్ ఓటమి చండీగఢ్/ముంబై: వ్యాపార దిగ్గజం, కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ హర్యానాలోని హిస్సార్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దేశంలో అత్యంత సంపన్నురాలిగా ‘ఫోర్బ్స్’ గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్.. మొన్నటిదాకా భూపీందర్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. మహారాష్ట్రలో 353 కోట్ల ఆస్తులను ప్రకటించిన బీజేపీ అశ్యర్థి మోహిత్ కంబోజ్ కూడా ఓటమి పాలయ్యారు. అంతే కాకుండా కేవలం 15వేల 934 రూపాయల ఆస్తులతో అతి పేదవాడిగా బరిలోకి దిగిన సీపీఎం అభ్యర్థి కిడాపిల్ నారాయణన్ కూడా ఓడిపోయారు. ఇక మహారాష్ట్రలో గణపాత్రో దేశ్‌ముఖ్(88) పదకొండోసారి ఎమ్మెల్యేగా నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈయన సోలాపూర్ జిల్లాలోని సాంగోలా స్థానం నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2302 మంది స్వతంత్రులు పోటీ చేయగా 2290మంది ఓటమి పాలయ్యారు. హర్యానాలోని రాయ్ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జైతీరథ్ దాహియా ఐఎన్ఎల్డీ అభ్యర్థిపై కేవలం 3 ఓట్ల తేడాతో గెలిచారు. -
‘మహా’లో కాషాయ హవా..
రెట్టింపైన బీజేపీ ఓట్ల షేర్ గణనీయంగా పెరిగిన శివసేన వాటా ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీల హవా బలంగా వీచింది. అది ఆ పార్టీల ఓట్ల షేరింగ్‌లో ప్రస్ఫుటంగా కనిపించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల షేరింగ్ రెట్టింపైంది. బహుముఖ పోరులో 122 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆ పార్టీ.. 27.8 శాతం ఓట్లను సాధించింది. కమలం పార్టీ 2009లో జరిగిన ఎన్నికల్లో 14.02 శాతం ఓట్లతో 46 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఓట్ల శాతం కన్నా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ఆ ఎన్నికల్లో శివసైనికులతో కలసి బరిలో దిగిన కమలనాథులు 27.8 శాతం ఓట్లతో 23 లోక్‌సభ సీట్లను చేజిక్కించుకున్నారు. ఇక ఓట్ల షేరింగ్‌లో మూడు శాతం పెరుగదల శివసేనకు రెట్టింపు సీట్లను గెలిపించి పెట్టింది. 2009లో 16.26 శాతం ఉన్న ఆ పార్టీ ఓట్ల షేరింగ్ ఈ ఎన్నికల్లో 19.4 శాతానికి పెరిగింది. దీంతో ఆ పార్టీ బలం 33 నుంచి 63కి ఎగబాకింది. దాదాపు ఇదే మూడు శాతం ఓట్లు కాంగ్రెస్‌ను మట్టికరిపించాయి. 2009 ఎన్నికల్లో 21.01 శాతం ఓట్లతో 82 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈ సారి 17.9 శాతం ఓట్లతో 42 సీట్లకు దిగజారింది. ఎన్సీపీకి ఓట్ల శాతం కొద్దిగా పెరిగినా గతంలో పోలిస్తే సీట్లు మాత్రం భారీగా తగ్గాయి. 2009లో 16.37 ఓట్లతో 62 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 17.3 శాతం ఓట్లతో 41 స్థానాలకు పరిమితమైంది. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన 3.1 శాతం ఓట్లతో 1 సీటుతో సరిపెట్టుకుంది. బీఎస్పీకి 2.3 శాతం, పీడబ్ల్యూపీఐకి 1 శాతం, ఏఐఎంఐఎంకి 0.9 శాతం ఓట్లు దక్కాయి. కాగా ఈ ఎన్నికల బరిలో మొత్తం 4,119 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బీజేపీ 280, కాంగ్రెస్ 287, ఎన్సీపీ 278, శివసేన 282, బీఎస్పీ 260, ఎంఎన్ఎస్ 219, సీపీఐ 34, సీపీఎం 19 మందిని బరిలో నిలిపాయి. ఎన్నికల ముందు పొత్తు చర్చల్లో శివసేన ప్రతిపాదించిన 119 సీట్ల కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు గెలవడం విశేషం. ఓటమికి నాదే బాధ్యత: పృథ్వీరాజ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. తమ పార్టీ ఇక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటుందన్నారు. -
శివసేన చీఫ్‌కు శరద్ పవార్ ప్రశంసలు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాలు మారొచ్చన్న సంకేతాల నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రేను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రశంసల్లో ముంచెత్తారు. శివసేన వ్యవస్థాపకుడైన తండ్రి బాల్‌ఠాక్రే 2012లో కన్నుమూశాక పార్టీని బలోపేతం చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. ఆదివారం ముంబైలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బాల్‌ఠాక్రే మరణంతో శివసేన భవిష్యత్తుపై మీడియా అనవసరంగా సిరాను వృథా చేసిందని...కానీ మీడియా అంచనాలను ఉద్ధవ్‌ఠాక్రే తన పనితీరుతో తప్పని నిరూపించారన్నారు. అంచనాలకు మించి పార్టీని బలోపేతం చేసేందుకు ఇంకా కృషి చేస్తున్నారన్నారు. -
నాకు ఓటమి భయమా?
షోలాపూర్, న్యూస్‌లైన్: ఏడుసార్లు లోక్‌సభకు, ఏడుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందిన తనకు పరాభవ భయమెక్కడిదని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. మోడీకి తన గురించి బాగానే భయం పట్టుకుందనీ, అందుకే ప్రతి బహిరంగ సభలో తన నామమే జపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారని మోడీపై పవార్ ఎదురుదాడికి దిగారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి పదవి ఆశించననీ ఇంతకు ముందే స్పష్టం చేశానన్నారు. పరాభవం భయంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మోడీ ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి తాను ఏడు సార్లు లోక్‌సభ, ఏడు సార్లు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినట్లు మోడీకి తెలియక పోవచ్చని విమర్శించారు. ఒకవేళ పోటీ చేసినా బారామతి, మాడాలలోనే పోటీ చేసేవాడిననీ, ఈ రెండు చోట్ల ఎన్సీపీనే గెలుపొందిందని, అలాంటప్పుడు తనకు పరాభావ భయమేక్కడిది అని ప్రశ్నించారు. మోడీకి పార్టీ వర్గాలు తప్పుడు సమాచారం అందించి ఉంటాయని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి ఒకే రాష్ట్రంలో 25 బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని, ఇంత సమయం ప్రచారానికి వెచ్చిస్తున్నారని, వేరే పని ఏమి లేదా? అని పవార్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీపై తనకు గౌరవం ఉందని, వాస్తవంగా రాజకీయాలలో ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదనే అభిప్రాయంతోనే తాను విమర్శించడంలేదన్నారు. గుజరాత్ ‘వెస్’ మరాఠీ అలజడులకు మోడీ ప్రభుత్వం ఆజ్యం పోస్తోందని, దీనిని రాష్ట్ర ప్రజలు సహించబోర ని హెచ్చరించారు. మోడీ.. మహారాష్ట్ర వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ మరాఠీయులను కించపరిచే విధంగా నడుచుకుంటూ, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేందుకు ఊతమిస్తున్నారని పవార్ ఆరోపించారు. రాష్ట్రంలోని డైమండ్ మార్కెట్‌ను గుజరాత్‌కు తరలించడం, ముంబై కోసం ‘సాగరి సురక్ష దళ్ శిక్షణ’ కేంద్రానికి ఆమోదం లభించినప్పటికీ ఆమోదాన్ని తోసిపుచ్చి గుజరాత్‌కు తీసుకు వెళ్లడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. మరాఠీయులు గుజరాత్లో అనేక ప్రాంతాలలో ఉంటూ అక్కడి వారితో మమేకమై ఉన్నారని, గుజరాతీయులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు కృషి చేశారన్నారు. మహారాష్ట్రకు వ్యతిరేకంగా కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటోందని, వీటి వల్లనే మరాఠీయులు వెస్ గుజరాతీయుల మధ్య వైరం పెరిగే అవకాశముందని పవార్ హెచ్చరించారు. సంఘ్ పరివార్.. బీజేపీల అజెండాను అమలు పరిచే దిశగా పావులు కదుపుతున్నారన్నారు. దసరా పర్వదినం సందర్భంగా సంఘ్ ప్రముఖుడి ప్రసంగాన్ని డీడీలో ప్రసారం చేశారని, అయితే బలహీన వర్గాల వారు దమ్మచక్ర పరివర్తన్‌ను నాగ్‌పూర్‌లో నిర్వహించినా దానిని డీడీలో ప్రసారం చేయలేదన్నారు. ఇలా వివక్ష చూపడం న్యాయం కాదని నిప్పులు చెరిగారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ప్రకటనలలో వాడుకుంటూ ఆయన పేరుతో ఓట్లు అడుక్కోవడం చట్టం ప్రకారం ఆమోదయోగ్యం కాదని కూడా పవార్ స్పష్టం చేశారు. మోడీ విమర్శలపై పవార్ ఎదురుదాడి ముంబై: రాష్ట్రంలో పలు ఎన్నికల సభల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనపై చేసిన విమర్శలను ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ తిప్పి కొట్టారు. ‘‘నా ఎన్నికల రికార్డు ఏమిటో ఆయనకు (మోడీ)కి చెప్పండి. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. నేను ఎన్నికలను తప్పించుకుంటానా?’’ అని సోమవారం మరాఠ్వాడా ప్రాంతంలోని అహ్మద్‌నగర్‌లో జరిగిన సభలో పవార్ ప్రశ్నించారు. యూపీఏ నౌక మునుగుతోందని తెలిసే శరద్ పవార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులుగా రాజ్యసభను ఎంచుకున్నారని మోడీ విమర్శించారు. దీనిపై పవార్ స్పందిస్తూ, ప్రధాన మంత్రికి తాను తప్ప మరో నాయకుడు కనిపించకపోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. ‘‘ఎన్నికల సభల్లో మోడీ ఏం మాట్లాడారు? ఏదైనా జాతీయ ప్రయోజనాన్ని గూర్చి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. సామాన్య మానవుని జీవితాన్ని మారుస్తానని చెప్పినా బాగుండేది. కానీ ఆయన ప్రసంగాలు చూస్తే, గరిష్టంగా శరద్పవార్పైనే దాడి చేసినట్టుగా ఉన్నాయి’’ అని ఎన్సీపీ అధ్యక్షుడు పేర్కొన్నారు. చవాన్ వల్లే సమస్యలు పరిష్కారం కాలేదు: అజిత్ సాక్షి, ముంబై: మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సహకారం లేకపోవడంవల్ల అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేక పోయాయని మాజీ ఉప ముఖ్యమంత్రి అజీత్ పవార్ ఆరోపించారు. ఔరంగాబాద్ జిల్లాలోని గంగాపూర్-ఖుల్తాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలో దిగిన ఎన్సీపీ అభ్యర్థి కృష్ణ పాటిల్ డోణ్గావ్కర్కు మద్దతుగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రచార సభలో అజిత్ పవార్ మాట్లాడారు. కొన్ని కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులకు 75 శాతం గ్రాంట్లు, అన్ని పాఠశాలలను డిజిటల్ క్లాస్ రూమ్‌లుగా ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల మాదిరిగా కాకుండా తమ పార్టీకి కుల, మతాలు తెలియవని, అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ముందుకు సాగుతుందంటూ పరోక్షంగా శివసేనను కూడా విమర్శించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
- భారీగా తిరుగుబాటు అభ్యర్థులు - వారసులకూ టికెట్లు సాక్షి ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్లు ప్రక్రియ శనివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేలు నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారి వల్వి ‘సాక్షి’కి తెలిపారు. ఆయన అందించిన వివరాల మేరకు రాష్ట్రంలో శుక్రవారం వరకు 3,040 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు శనివారం ఒక్కరోజే సుమారు మూడు వేలు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో పత్రాలు సమర్పించేందుకు వచ్చిన రాజకీయ నాయకులు తమ మందీ మార్బలంతో ఎన్నికల కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున బలప్రదర్శనలు నిర్వహించారు. చివరి రోజు రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు పెద్ద సంఖ్యలో తిరుగుబాటుదారులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లను తిరిగి వెనక్కి తీసుకునేందుకు అక్టోబరు ఒకటవ తేదీ వరకు గడువు ఉంది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు విడివిడిగా పోటీ చేస్తుండడంతో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్లు వేసే నాయకులు ముందుగానే తాము వచ్చే సమయాన్ని తెలియచేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అభ్యర్థులు బ్యాండుమేళాలతో ఊరేగింపులతో వచ్చి నామినేషన్లు వేశారు. పార్టీ నుంచి టిక్కెట్ లభిస్తే సరే లేదంటేతిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలవాలని అనేక మంది నిర్ణయించుకున్నారు. చివరి క్షణంలో అనేక మంది తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఠాణేలో శివసేన నాయకుడు అనంత్ తరే చివరి రోజు పార్టీ అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా కోప్రి-పాచ్‌పాఖడీ అసెంబ్లీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో శివసేనకు కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఏర్పడ్డాయి. మరోవపు ఇలాంటి సంఘటనలే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కన్పించాయి. వారసత్వ రాజకీయాలు... వారసత్వ రాజకీయాలు లేవని ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు సీనియర్ నాయకులు తమ బంధువులు, వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్‌లో... కాంగ్రెస్‌లో అనేకమంది నాయకుల వారసులకు, బంధువులకు టిక్కెట్లు లభించాయి. ముఖ్యంగా సీనియర్ నాయకుడైన నారాయణ రాణే కుడాల్-మాలవణ్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయగా ఆయన కుమారుడు నితేష్ రాణే కనకవ్లీ-దేవగడ్-వైభవ్వాడీ సీటు నుంచి బరిలోఇక దిగారు. మరోవైపు ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే కుమారుని కోసం యావత్మాల్ అసెంబ్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నందినీ పార్వేకర్ను తప్పించారు. అక్కడి నుంచి మాణిక్ రావ్ ఠాక్రే కుమారుడు రాహుల్ బరిలోకి దిగారు. భోకర్ నుంచి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సతీమణి అమితా చవాన్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. దివంగత మాజీ మంత్రి సుభాష్ జనక్ కుమారుడు అమిత్‌ను రిసోడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇలా అనేక మంది కాంగ్రెస్ నాయకుల బంధువులు బరిలో ఉన్నారు. ఎన్సీపీలో... ఎన్సీపీలో కూడా పెద్ద ఎత్తున వారసత్వ రాజకీయాలు కన్పించాయి. మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షులు సునీల్ తట్కరే సోదరుని కుమారుడైన అవదూత్ తట్కరేకు శ్రీవర్ధన్ నుంచి టిక్కెట్ లభించింది. మరోవైపు శాసనమండలి ఉపసభాపతి వసంత్ డావ్కరే కుమారుడు నిరంజన్ డావ్కరేను ఠాణే నుంచి బరిలోకి దింపారు. ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మలిక్ సోదరుడు కప్తాన్ మలిక్‌కు కలీనా అసెంబ్లీ నియోజకవర్గంలో టిక్కెట్ కెటాయించారు. ఇలా ఎన్సీపీలో కూడా పెద్ద ఎత్తున ప్రముఖ నాయకుల బంధువులకు టిక్కెట్లు లభించాయి. శివసేన, బీజేపీలలో... శివసేన, బీజేపీలలో పలువురు నాయకుల బంధువులకు టిక్కెట్లు లభించాయి. శివసేన నాయకుడైన మాజీ మంత్రి బబన్‌రావ్ ఘోలప్ కుమారుడు యోగేష్‌కు దేవలాలి నియోజకవర్గంలో టిక్కెట్ లభించింది. ఎమ్మెల్యే అశోక్ కాలే కుమారున్ని కోపర్గావ్ నియోజకవర్గం నుంచి శివసేన బరిలోకి దింపింది. ఇక బీజేపీని పరిశీలిస్తే మాజీ సహాయక మంత్రి ప్రశాంత్ హిరే కుమారుడు అద్వయ్కు నందగావ్ నుంచి టిక్కెట్ కేటాయించారు. -
కాషాయ బంధం నిలిచింది!
శివసేన, బీజేపీ పొత్తు ఓకే శివసేనకు 151, బీజేపీకి 130, మిత్రపక్షాలకు 7 సీట్లు ఇచ్చేలా కుదిరిన అవగాహన ముంబై/న్యూఢిల్లీ: పాతికేళ్ల బంధం నిలబడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తును కొనసాగించాలని బీజేపీ, శివసేనలు నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటులో ఏర్పడ్డ ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు పార్టీల రాష్ట్రస్థాయి నేతలు మంగళవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల పంపకానికి సంబంధించి ఒక కొత్త ప్రతిపాదనపై చర్చ జరిపామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్, బీజేపీ నేత వినోద్ తావ్దే తెలిపారు. ఆ ప్రతిపాదన వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. అయితే, పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆ ప్రతిపాదనలో.. బీజేపీకి 130 స్థానాలు ఇచ్చేందుకు శివసేన అంగీకరించింది. అదే సమయంలో తాము మొదట్నుంచీ చెబుతున్నట్లుగా 151 సీట్లలో సేన పోటీ చేస్తుంది. బీజేపీకి పెరిగే సీట్ల మేరకు మహాకూటమి(మహాయుతి)లోని ఇతర పార్టీలకు కేటాయించిన సీట్లలో కోత విధిస్తారు. కూటమిలోని మిత్రపక్షాలైన ఆర్పీఐ(అథవలే), రాష్ట్రీయ సమాజ్‌పక్ష్, స్వాభిమాని షేత్కారీ పక్ష్, శివ్ సంగ్రామ్లతో ఈ ప్రతిపాదనపై చర్చించి, వాటి ఆమోదం తరువాత దీన్ని అధికారికంగా ప్రకటిస్తారు. పై ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఆ మిత్రపక్షాలకు 7 స్థానాలు మాత్రమే మిగుల్తాయి. బీజేపీకి 119 స్థానాలకు మించి ఇవ్వబోమని శివసేన తేల్చిచెప్పడం, కనీసం 130 సీట్లు కావల్సిందేనని బీజేపీ పట్టుబట్టడంతో పొత్తు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటం తెలిసిందే. ప్రజలు కోరుకుంటున్నారు: ఉద్ధవ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న తన ఆశను పక్షం రోజుల క్రితం బహిరంగంగా వెల్లడించిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అది ప్రజల ఆకాంక్షేనంటూ మంగళవారం మాట మార్చారు. కాంగ్రెస్, ఎన్సీపీ చర్చలు అసంపూర్ణం కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇరు పార్టీల నేతలు మంగళవారం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అధికారిక నివాసంలో మంగళవారం జరిగిన సుదీర్ఘ చర్చల్లో 124 స్థానాల్లో పోటీ చేయాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను ఎన్సీపీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. 144 సీట్లు కావాల్సిందేనని పట్టుబట్టింది. కాగా, ఎన్సీపీతో పొత్తు కొనసాగుతుందన్న ఆశాభావాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది. -
అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
ముంబై: మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ వెలువడింది. 288 మంది సభ్యులుండే అసెంబ్లీకి అక్టోబర్ 15వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను ఒకే దశలో నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. వీటితోపాటు బీడ్ ఎంపీ సీటుకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయుని ఆయున చెప్పారు. బీజేపీ నేత గోపీనాథ్ ముండే వురణంతో ఈ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. శనివారం నుంచే ఎన్నికల ప్రక్రియు ప్రారంభమైందని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ► ఈనెల 27వతేదీ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. ► అక్టోబర్ 1 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. ► అక్టోబర్ 15వ తేదీన పోలింగ్ ► అక్టోబర్ 19వ తేదీన ఓట్ల లెక్కింపు కాగా వచ్చే నెల 15న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం జారీచేసింది. -
తేలని ‘మహా’ సర్దుబాట్లు
కాంగ్రెస్-ఎన్సీపీ, శివసేన-బీజేపీ మధ్య కొలిక్కిరాని సీట్ల పంపకాలు ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ (అక్టోబర్ 15న పోలింగ్) అధికార కాంగ్రెస్-ఎన్సీపీ, ప్రతిపక్ష శివసేన-బీజేపీ కూటముల మధ్య సీట్ల సర్దుబాటు అంశం చిచ్చురేపుతోంది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకుగానూ మెజారిటీ స్థానాల కోసం నాలుగు పార్టీలూ ఈసారి పట్టుబడుతుండటంతో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైనప్పటికీ సీట్ల సర్దుబాటు చర్చల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ఈ పరిణామం కూటమి పార్టీల ఆశావహ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. అయితే ఒకవేళ చర్చలు ఫలించకపోతే ఒంటరి పోటీకి సిద్ధమనే సంకేతాలను నాలుగు పార్టీలూ ఇస్తుండటం గమనార్హం. కాంగ్రెస్‌కు ఎన్సీపీ 24 గంటల గడువు సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కిరాకపోవడంపై అసహనంతో ఉన్న శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ ఈ అంశంపై తేల్చేందుకు కాంగ్రెస్‌కు శనివారం 24 గంటల గడువు ఇచ్చింది. కాంగ్రెస్ ఇస్తామన్న 124 సీట్ల ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించింది. తమకు 144 సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎన్సీపీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ శనివారం ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఈ విషయంలో మరో రోజు గడువు ఇస్తున్నట్లు చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ దాఖలైనందున ఇంతకుమించి తాము వేచిచూడలేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇస్తామంటున్న 124 సీట్లు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కుదరదన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్‌కన్నా తమ పార్టీయే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుందని...అందువల్ల సీట్ల సర్దుబాటుపై పాత లెక్కలు ప్రస్తుతం వర్తించబోవన్నారు. 2004లోనే తమ పార్టీ 124 సీట్లలో పోటీ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఆదివారంలోగా కాంగ్రెస్ నేతలు స్పష్టత ఇవ్వకుంటే సోమవారం సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ను కలిసి ఏదో విషయం తేల్చుకుంటానన్నారు. ఒకవేళ అవసరమైతే ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా? అని విలేకరులు ప్రశ్నించగా ఆ అవకాశం అన్ని పార్టీలకూ ఉందన్నారు. మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మాణిక్‌రావు ఠాక్రే ఢిల్లీలో ఈ అంశంపై స్పందిస్తూ ఎన్సీపీ తమ ప్రతిపాదనకు ఒకటి, రెండు రోజుల్లో ఒప్పుకోకుంటే తాము అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీ చేయగా ఎన్సీపీ 114 సీట్లలో పోటీ చేసింది. శివసేన-బీజేపీ పరిస్థితీ ఇంతే... కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి తరహాలోనే శివసేన-బీజేపీ కూటమి కూడా సీట్ల సర్దుబాటుపై శుక్ర, శనివారాల్లో రెండు విడతలుగా చర్చలు జరిపినా ప్రతిష్టంభనకు తెరపడలేదు. చెరో 135 సీట్లలో పోటీ చేసి మిగిలిన 18 సీట్లను కూటమిలోని చిన్న పార్టీలైన ఆర్పీఐ, స్వాభిమాని శేత్కరి సంఘటనలకు ఇద్దామంటూ బీజేపీ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చిన శివసేన తాము 155 సీట్లలో పోటీ చేస్తామని ప్రతిపాదించింది. అయితే మహారాష్ట్ర శాసన మండలిలో విపక్ష నేత, బీజేపీ నాయకుడు వినోద్ తావ్దే శనివారం మాట్లాడుతూ శివసేన ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. శివసేన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 59 సీట్లతోపాటు తాము పోటీ చేసి ఓడిన 19 సీట్లను మార్చుకుంటే బాగుంటుందని తావ్దే సూచించారు. ఎన్నికల్లో కూటమి తరఫున 200 సీట్లు గెల్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో మరో 24 గంటల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు తావ్దే పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం జరిగే తమ పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పార్టీ చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే తుది నిర్ణయం తీసుకుంటారని శివసేన ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. బీజేపీకి 125 సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. గత ఎన్నికల్లో శివసేన 169 సీట్లలో, బీజేపీ 119 సీట్లలో పోటీ చేశాయి. హర్యానా ఎన్నికల బరిలో సుష్మా సోదరి: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెల్లెలు వందన శర్మ హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. శనివారం 47 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ విడుదల చేసిన తుది జాబితాలో ఆమె పేరూ ఉంది. బీజేపీ చీఫ్ అమిత్‌షా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, సుష్మా తదితరులతో కూడిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమై జాబితాకు ఆమోదం తెలిపింది. -
50:50 కి ఒప్పుకోవాల్సిందే..
ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 50 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌కు జాతీయ కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం జారీచేసింది. ఆ పార్టీ నాయకుడు ప్రఫుల్ పటేల్ శనివారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ తమకు కేటాయిస్తామంటున్న 124 సీట్లకు ఒప్పుకోమన్నారు. 288 సీట్లకు గాను తమకు 144 స్థానాలు కేటాయించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ‘మాకు 124 స్థానాలే ఇస్తామని కాంగ్రెస్ అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాకు 50 శాతం సీట్లు కేటాయించాల్సిందేనని మేం ఇప్పటికే చాలాసార్లు చెప్పాం..’ అని పటేల్ అన్నారు. ‘ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఆ పార్టీ ప్రతిస్పందన కోసం మేం మరో రోజు ఎదురుచూస్తాం.. తర్వాత ఏంచేయాలనేది నిర్ణయించుకుంటా’మని చెప్పారు. తాము ఇప్పటికీ కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన సీట్ల నేపథ్యంలోనే ప్రస్తుతం తాము సగం సీట్లు అడుగుతున్నామని ఆయన నొక్కిచెప్పారు. గతంలో కాంగ్రెస్ కన్నా మేం ఎక్కువ సీట్లు గెలుచుకున్నా సీఎం పదవి వారికే వదిలివేశామనే విషయాన్ని వారు గుర్తుచేసుకోవాలన్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి.. అందుకే మేం 144 స్థానాలు కోరుతున్నాం.. ఇదేం కొత్త డిమాండ్ కాదు కదా..’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
దీపావళి తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు?
సాక్షి, ముంబై : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికలకు మూహూర్తం దగ్గరపడుతోంది. మహారాష్ట్రతోపాటు మరో మూడు రాష్ట్రాల్లో దీపావళి పండుగ తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న సంకేతాలు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వస్తున్నాయి. మహారాష్ట్రలో శాసనసభ గడువు నవంబర్ 7వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా అందిన వివరాల మేరకు దీపావళ్లి పండుగ తర్వాతే ఎన్నికలు నిర్వాహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలిసింది. అక్టోబరు 3వ తేదీ దసరా, అక్టోబరు 23వ తేదీన దీపావళి పండుగులున్నాయి. ఈ క్రమంలో నవంబర్ లేదా డిసెంబరు మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీపావళికి ముందే ఎన్నికలు నిర్వహిస్తే, ఆగస్టు మొదటివారంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కానీ, ఆగస్టు 29న వినాయకుని ఉత్సవాలు ఉన్నాయి. దీంతో గణేషోత్సవాల తర్వాతే ఎన్నికలు కోడ్ అమలు చేయాలని గణేషోత్సవ మండళ్లు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తంగా దీపావళి తర్వాత ఎన్నికలు నిర్వహించినట్టయితే ఎవరికీ ఇబ్బందులు తలెత్తవనే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆగస్టు 29న వినాయకుని ఉత్సవాలు, అక్టోబరు 3వ తేదీ దసరా , అక్టోబరు 23వ తేదీ దీపావళి పండుగులున్నాయి. దీపావళి పండుగ ఆగస్టు మొదటివారంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని భావించారు. దీనిైపై గణేషోత్సవాల తర్వాతే ఎన్నికలు కోడ్ అమలు చేయాలని గణేషోత్సవ మండళ్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి తర్వాత ఎన్నికలు నిర్వహించినట్టయితే ఎన్నికల కోడ్అమలు కూడా కొంత ఆలస్యంగా అమల్లోకి రానుంది. నవంబర్ లేదా డిసెంబరు మొదటివారంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.తాజాగా అందిన వివరాల మేరకు దీపావళ్లి పండుగ తర్వాతే ఎన్నికలు నిర్వాహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలిసింది.