తేలని ‘మహా’ సర్దుబాట్లు
కాంగ్రెస్-ఎన్సీపీ, శివసేన-బీజేపీ మధ్య కొలిక్కిరాని సీట్ల పంపకాలు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ (అక్టోబర్ 15న పోలింగ్) అధికార కాంగ్రెస్-ఎన్సీపీ, ప్రతిపక్ష శివసేన-బీజేపీ కూటముల మధ్య సీట్ల సర్దుబాటు అంశం చిచ్చురేపుతోంది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకుగానూ మెజారిటీ స్థానాల కోసం నాలుగు పార్టీలూ ఈసారి పట్టుబడుతుండటంతో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైనప్పటికీ సీట్ల సర్దుబాటు చర్చల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ఈ పరిణామం కూటమి పార్టీల ఆశావహ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. అయితే ఒకవేళ చర్చలు ఫలించకపోతే ఒంటరి పోటీకి సిద్ధమనే సంకేతాలను నాలుగు పార్టీలూ ఇస్తుండటం గమనార్హం.
కాంగ్రెస్‌కు ఎన్సీపీ 24 గంటల గడువు
సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కిరాకపోవడంపై అసహనంతో ఉన్న శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ ఈ అంశంపై తేల్చేందుకు కాంగ్రెస్‌కు శనివారం 24 గంటల గడువు ఇచ్చింది. కాంగ్రెస్ ఇస్తామన్న 124 సీట్ల ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించింది. తమకు 144 సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎన్సీపీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ శనివారం ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఈ విషయంలో మరో రోజు గడువు ఇస్తున్నట్లు చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ దాఖలైనందున ఇంతకుమించి తాము వేచిచూడలేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇస్తామంటున్న 124 సీట్లు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కుదరదన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్‌కన్నా తమ పార్టీయే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుందని...అందువల్ల సీట్ల సర్దుబాటుపై పాత లెక్కలు ప్రస్తుతం వర్తించబోవన్నారు. 2004లోనే తమ పార్టీ 124 సీట్లలో పోటీ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఆదివారంలోగా కాంగ్రెస్ నేతలు స్పష్టత ఇవ్వకుంటే సోమవారం సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ను కలిసి ఏదో విషయం తేల్చుకుంటానన్నారు. ఒకవేళ అవసరమైతే ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా? అని విలేకరులు ప్రశ్నించగా ఆ అవకాశం అన్ని పార్టీలకూ ఉందన్నారు. మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మాణిక్‌రావు ఠాక్రే ఢిల్లీలో ఈ అంశంపై స్పందిస్తూ ఎన్సీపీ తమ ప్రతిపాదనకు ఒకటి, రెండు రోజుల్లో ఒప్పుకోకుంటే తాము అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీ చేయగా ఎన్సీపీ 114 సీట్లలో పోటీ చేసింది.
శివసేన-బీజేపీ పరిస్థితీ ఇంతే...
కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి తరహాలోనే శివసేన-బీజేపీ కూటమి కూడా సీట్ల సర్దుబాటుపై శుక్ర, శనివారాల్లో రెండు విడతలుగా చర్చలు జరిపినా ప్రతిష్టంభనకు తెరపడలేదు. చెరో 135 సీట్లలో పోటీ చేసి మిగిలిన 18 సీట్లను కూటమిలోని చిన్న పార్టీలైన ఆర్పీఐ, స్వాభిమాని శేత్కరి సంఘటనలకు ఇద్దామంటూ బీజేపీ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చిన శివసేన తాము 155 సీట్లలో పోటీ చేస్తామని ప్రతిపాదించింది. అయితే మహారాష్ట్ర శాసన మండలిలో విపక్ష నేత, బీజేపీ నాయకుడు వినోద్ తావ్‌దే శనివారం మాట్లాడుతూ శివసేన ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. శివసేన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 59 సీట్లతోపాటు తాము పోటీ చేసి ఓడిన 19 సీట్లను మార్చుకుంటే బాగుంటుందని తావ్‌దే సూచించారు. ఎన్నికల్లో కూటమి తరఫున 200 సీట్లు గెల్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో మరో 24 గంటల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు తావ్‌దే పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం జరిగే తమ పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పార్టీ చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే తుది నిర్ణయం తీసుకుంటారని శివసేన ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. బీజేపీకి 125 సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. గత ఎన్నికల్లో శివసేన 169 సీట్లలో, బీజేపీ 119 సీట్లలో పోటీ చేశాయి.
హర్యానా ఎన్నికల బరిలో సుష్మా సోదరి: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెల్లెలు వందన శర్మ హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. శనివారం 47 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ విడుదల చేసిన తుది జాబితాలో ఆమె పేరూ ఉంది. బీజేపీ చీఫ్ అమిత్‌షా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, సుష్మా తదితరులతో కూడిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమై జాబితాకు ఆమోదం తెలిపింది.