‘మహా’లో కాషాయ హవా..
రెట్టింపైన బీజేపీ ఓట్ల షేర్
గణనీయంగా పెరిగిన శివసేన వాటా
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీల హవా బలంగా వీచింది. అది ఆ పార్టీల ఓట్ల షేరింగ్‌లో ప్రస్ఫుటంగా కనిపించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల షేరింగ్ రెట్టింపైంది. బహుముఖ పోరులో 122 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆ పార్టీ.. 27.8 శాతం ఓట్లను సాధించింది. కమలం పార్టీ 2009లో జరిగిన ఎన్నికల్లో 14.02 శాతం ఓట్లతో 46 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఓట్ల శాతం కన్నా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ఆ ఎన్నికల్లో శివసైనికులతో కలసి బరిలో దిగిన కమలనాథులు 27.8 శాతం ఓట్లతో 23 లోక్‌సభ సీట్లను చేజిక్కించుకున్నారు. ఇక ఓట్ల షేరింగ్‌లో మూడు శాతం పెరుగదల శివసేనకు రెట్టింపు సీట్లను గెలిపించి పెట్టింది. 2009లో 16.26 శాతం ఉన్న ఆ పార్టీ ఓట్ల షేరింగ్ ఈ ఎన్నికల్లో 19.4 శాతానికి పెరిగింది. దీంతో ఆ పార్టీ బలం 33 నుంచి 63కి ఎగబాకింది.
దాదాపు ఇదే మూడు శాతం ఓట్లు కాంగ్రెస్‌ను మట్టికరిపించాయి. 2009 ఎన్నికల్లో 21.01 శాతం ఓట్లతో 82 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈ సారి 17.9 శాతం ఓట్లతో 42 సీట్లకు దిగజారింది. ఎన్‌సీపీకి ఓట్ల శాతం కొద్దిగా పెరిగినా గతంలో పోలిస్తే సీట్లు మాత్రం భారీగా తగ్గాయి. 2009లో 16.37 ఓట్లతో 62 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 17.3 శాతం ఓట్లతో 41 స్థానాలకు పరిమితమైంది. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన 3.1 శాతం ఓట్లతో 1 సీటుతో సరిపెట్టుకుంది. బీఎస్‌పీకి 2.3 శాతం, పీడబ్ల్యూపీఐకి 1 శాతం, ఏఐఎంఐఎంకి 0.9 శాతం ఓట్లు దక్కాయి. కాగా ఈ ఎన్నికల బరిలో మొత్తం 4,119 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బీజేపీ 280, కాంగ్రెస్ 287, ఎన్‌సీపీ 278, శివసేన 282, బీఎస్‌పీ 260, ఎంఎన్‌ఎస్ 219, సీపీఐ 34, సీపీఎం 19 మందిని బరిలో నిలిపాయి. ఎన్నికల ముందు పొత్తు చర్చల్లో శివసేన ప్రతిపాదించిన 119 సీట్ల కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు గెలవడం విశేషం.
ఓటమికి నాదే బాధ్యత: పృథ్వీరాజ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. తమ పార్టీ ఇక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటుందన్నారు.