ముగిసిన నామినేషన్ల పర్వం
- భారీగా తిరుగుబాటు అభ్యర్థులు
- వారసులకూ టికెట్లు
సాక్షి ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్లు ప్రక్రియ శనివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేలు నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారి వల్వి ‘సాక్షి’కి తెలిపారు. ఆయన అందించిన వివరాల మేరకు రాష్ట్రంలో శుక్రవారం వరకు 3,040 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు శనివారం ఒక్కరోజే సుమారు మూడు వేలు దాఖలయ్యాయి.
నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో పత్రాలు సమర్పించేందుకు వచ్చిన రాజకీయ నాయకులు తమ మందీ మార్బలంతో ఎన్నికల కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున బలప్రదర్శనలు నిర్వహించారు. చివరి రోజు రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు పెద్ద సంఖ్యలో తిరుగుబాటుదారులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లను తిరిగి వెనక్కి తీసుకునేందుకు అక్టోబరు ఒకటవ తేదీ వరకు గడువు ఉంది.
ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు విడివిడిగా పోటీ చేస్తుండడంతో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్లు వేసే నాయకులు ముందుగానే తాము వచ్చే సమయాన్ని తెలియచేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అభ్యర్థులు బ్యాండుమేళాలతో ఊరేగింపులతో వచ్చి నామినేషన్లు వేశారు. పార్టీ నుంచి టిక్కెట్ లభిస్తే సరే లేదంటేతిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలవాలని అనేక మంది నిర్ణయించుకున్నారు. చివరి క్షణంలో అనేక మంది తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఠాణేలో శివసేన నాయకుడు అనంత్ తరే చివరి రోజు పార్టీ అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా కోప్రి-పాచ్‌పాఖడీ అసెంబ్లీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో శివసేనకు కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఏర్పడ్డాయి. మరోవపు ఇలాంటి సంఘటనలే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కన్పించాయి.
వారసత్వ రాజకీయాలు...
వారసత్వ రాజకీయాలు లేవని ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు సీనియర్ నాయకులు తమ బంధువులు, వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారు.
కాంగ్రెస్‌లో...
కాంగ్రెస్‌లో అనేకమంది నాయకుల వారసులకు, బంధువులకు టిక్కెట్లు లభించాయి. ముఖ్యంగా సీనియర్ నాయకుడైన నారాయణ రాణే కుడాల్-మాలవణ్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయగా ఆయన కుమారుడు నితేష్ రాణే కనకవ్లీ-దేవగడ్-వైభవ్‌వాడీ సీటు నుంచి బరిలోఇక దిగారు. మరోవైపు ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే కుమారుని కోసం యావత్మాల్ అసెంబ్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నందినీ పార్వేకర్‌ను తప్పించారు. అక్కడి నుంచి మాణిక్ రావ్ ఠాక్రే కుమారుడు రాహుల్ బరిలోకి దిగారు. భోకర్ నుంచి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సతీమణి అమితా చవాన్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. దివంగత మాజీ మంత్రి సుభాష్ జనక్ కుమారుడు అమిత్‌ను రిసోడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇలా అనేక మంది కాంగ్రెస్ నాయకుల బంధువులు బరిలో ఉన్నారు.
ఎన్సీపీలో...
ఎన్సీపీలో కూడా పెద్ద ఎత్తున వారసత్వ రాజకీయాలు కన్పించాయి. మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షులు సునీల్ తట్కరే సోదరుని కుమారుడైన అవదూత్ తట్కరేకు శ్రీవర్ధన్ నుంచి టిక్కెట్ లభించింది. మరోవైపు శాసనమండలి ఉపసభాపతి వసంత్ డావ్కరే కుమారుడు నిరంజన్ డావ్కరేను ఠాణే నుంచి బరిలోకి దింపారు. ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మలిక్ సోదరుడు కప్తాన్ మలిక్‌కు కలీనా అసెంబ్లీ నియోజకవర్గంలో టిక్కెట్ కెటాయించారు. ఇలా ఎన్సీపీలో కూడా పెద్ద ఎత్తున ప్రముఖ నాయకుల బంధువులకు టిక్కెట్లు లభించాయి.
శివసేన, బీజేపీలలో...
శివసేన, బీజేపీలలో పలువురు నాయకుల బంధువులకు టిక్కెట్లు లభించాయి. శివసేన నాయకుడైన మాజీ మంత్రి బబన్‌రావ్ ఘోలప్ కుమారుడు యోగేష్‌కు దేవలాలి నియోజకవర్గంలో టిక్కెట్ లభించింది. ఎమ్మెల్యే అశోక్ కాలే కుమారున్ని కోపర్‌గావ్ నియోజకవర్గం నుంచి శివసేన బరిలోకి దింపింది. ఇక బీజేపీని పరిశీలిస్తే మాజీ సహాయక మంత్రి ప్రశాంత్ హిరే కుమారుడు అద్వయ్‌కు నందగావ్ నుంచి టిక్కెట్ కేటాయించారు.