పట్నా: బిహార్‌లో మహాకూటమి విచ్ఛిన్నమవడం 11 కోట్ల మంది రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని జేడీ(యూ) సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ అన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో జేడీయూ తెగతెంపులు చేసుకుని బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తరువాత ఆయన గురువారం తొలిసారి బిహార్ పర్యటనకు వచ్చారు.
పట్నా విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడుతూ...‘బిహార్‌లో మహాకూటమికి అధికారం అప్పగించిన 11 కోట్ల మంది ప్రజల విశ్వాసం దెబ్బతింది. ఐదేళ్లు కొనసాగాల్సిన మహాకూటమి ఒప్పందం అర్ధంతరంగా ముగియడం నన్నెంతో బాధించింది’ అని శరద్ అన్నారు. ఆ తరువాత సోనెపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ...సర్కారీ జేడీ(యూ) నితీశ్ వద్ద ఉన్నా అసలు జేడీ(యూ) తన వద్దే ఉందన్నారు. తదుపరి సాధారణ ఎన్నికల తరువాత లౌకికవాద పార్టీలతో కలసి అసలు జేడీ(యూ) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.