సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా బీజేపీ అసంతృప్త నేత, ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా విమర్శల దాడి చేపట్టారు. ప్రధాని మోదీ చౌకీదార్ల ప్రచారంలో నిమగ్నమైతే ఆయనకు దేశ ప్రజలు జవాబులేని ప్రశ్నల గురించి గుర్తుచేస్తారని హెచ్చరించారు. దేశంలోని చౌకీదార్లను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించడాన్ని తప్పుపట్టిన సిన్హా వారిలో చాలా మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధానికి హోళీ శుభాకాంక్షలు చెబుతూ మోదీని ఉద్దేశిస్తూ..‘సర్‌జీ..మీరు దయచేసి కాపలాదారుల గురించి లోతుగా వెళ్లకండి.. మీ నుంచి జవాబులేని ప్రశ్నల గురించి, రఫేల్ ఒప్పందం గురించి ప్రజలు చాలా తెలుసుకోవాలని భావిస్తున్నార’ని వ్యాఖ్యానించారు. చౌకీదార్‌ల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయని, వారిలో చాలామంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని శత్రుఘ్న సిన్హా ట్వీట్ చేశారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ గతవారం సోషల్ మీడియాలో చౌకీదార్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్విటర్‌లో తన పేరు ముందు ఆయన చౌకీదార్ పదం చేర్చారు. ప్రధాని బాటనే పార్టీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నేతలు చౌకీదార్ క్యాంపెయిన్‌ను అనుసరించి తమ పేర్ల ముందు ఆ పదాన్ని జోడించారు. ఇక బుధవారం దేశంలోని 25 లక్షల మంది చౌకీదార్లు (సెక్యూరిటీ గార్డులు) ఉద్దేశించి మోదీ మాట్లాడారు. రఫేల్ ఒప్పందంలో తనను విమర్శించేందుకు రాహుల్ పలుమార్లు కాపలాదారే దొంగ అనే పదాన్ని వాడటం పట్ల ఆయన చౌకీదార్లకు క్షమాపణ చెప్పారు.కాగా పట్నా నుంచి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment