సాక్షి, న్యూఢిల్లీ : తాజ్ మహల్ వివాదం పచ్చిగా ఉండగానే.. ఇప్పుడు తెరపైకి మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. దేశ రాజధానిలోని హుమయున్ సమాధిని కూల్చివేయాలంటూ ఉత్తర ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. తద్వారా ముస్లింలకు పెద్ద సమస్య తీరుతుందని ఆయన అంటున్నారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ వసీమ్ రిజ్వీ లేఖలోని విషయాలను గురువారం మీడియాకు తెలియజేశారు.
హుమయున్ సమాధిని కూల్చివేయాల్సిందే. ప్రస్తుతం దేశంలో ముస్లింలు చనిపోతే వారిని ఖననం చేసేందుకు స్థలం లేకుండా పోయింది. ఇప్పుడు హుమాయున్ సమాధి ఉన్న ప్రాంతాన్ని గనుక అప్పగిస్తే స్మశానం(ఖబరిస్థాన్) లోటు తీరుతుంది. మరో వందేళ్లదాకా ముస్లిం జనాభా కోసం స్మశాన వాటిక నిర్మించాల్సిన అవసరం లేదు. అని రిజ్వీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్టాల మూలంగా కొత్త సమాధులు నిర్మించటం సాధ్యమయ్యే పని కాదని.. అందుకే హుమయూన్ సమాధి కూల్చివేతకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
అయినా చనిపోయాక రాజు.. పేద తేడా ఏంటి? ఇప్పుడు ఆ సమాధిని ఇలా ఉపయోగించటం వల్ల ఆయన చేసిన పాపాల్లో కాస్తైన ప్రాయశ్చిత్తం దక్కుతుందేమో అని రిజ్వీ చెప్పారు. అభివృద్ధి కోసం ఖర్చు చేయాలే తప్ప.. దేశ సంపదను కొల్లగొట్టి.. ప్రజలను హింసించిన ఇలాంటి వారి సమాధులపై కాదని అన్నారు. ఇక తాజ్ వ్యవహారంపై స్పందిస్తూ... దానిని సమాధిగా ఎవరూ చూడరని.. ఓ అందమైన ప్రపంచ వింతగానే భావిస్తారని ఆయన అన్నారు.
మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ సమాధి 30 ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉండగా.. మొత్తం 200 ఎకరాలకు పైగానే ఆ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో ‘ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’ అభివృద్ధి పనులను నిర్వహిస్తోంది. అయితే జాతీయ వారసత్వ సంపద జాబితాలో ఉన్న దీనిని తొలగించి కూల్చివేయాలని ఇప్పుడు షియా బోర్డే లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment