Shia Central Waqf Board
-
మందిర నిర్మాణం: షియా బోర్డు భారీ విరాళం
లక్నో: అయోధ్య వివాదం ముగిసి పోయిన నేపథ్యంలో రామమందిర నిర్మాణానికి సర్వం సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి తామూ చేయూతనిస్తామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ముందుకొచ్చింది. మందిర నిర్మాణం కొరకు రూ.51000 విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షియా సెంట్రల్ బోర్డు చీఫ్ వసీం రిజ్వీ శుక్రవారం తెలిపారు. రామ మందిర నిర్మాణానికి తాము అనుకూలమని అన్నారు. కాగా వివాదాస్పద రామ మందిర- బాబ్రీ మసీదు భూమిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద భూమిని మందిర నిర్మాణానికి కేటాయించి, మసీదుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో దశాబ్దాలుగా హిందూ సంఘాలు చేస్తున్న మందిర నిర్మాణ ప్రయత్నానికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. త్వరలోకే కేంద్ర ప్రభుత్వ అయోధ్య ట్రస్ట్‌నూ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే చర్యలు, సంప్రదింపులను ప్రారంభించింది. -
‘అయోధ్య’పై ఎన్నో పార్టీలు ఎన్నో గొడవలు
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని బాబ్రీ–రామ మందిరం వివాదం కేసుపై ఐదుగురు సుప్రీం కోర్టు జడ్జీల బెంచీ ముందు తుది విచారణ జరగుతున్న విషయం తెల్సిందే. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమై 38 రోజులకుపైగా కొనసాగిన విచారణ ఈ రోజుతో ముగుస్తుంది. ఇది కేవలం ముస్లిం, హిందువులకు మధ్య కొనసాగుతున్న వివాదంగా సామాన్య ప్రజలకు కనిపిస్తోంది. కానీ ఎన్నో పార్టీల ప్రమేయం ఎన్నో గొడవలు ఉన్నాయి. అటు ముస్లిం పార్టీల్లో, ఇటు హిందూ పార్టీల్లో పరస్పర విరుద్ధ వైఖరులు కూడా ఉన్నాయి. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి 16వ శతాబ్దంలో బాబర్ మసీదు నిర్మించారని, ఆ స్థలంలో తిరిగి రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతించాలని ‘నిర్మోహి అఖారా’ సంస్థ ఆది నుంచి డిమాండ్ చేస్తోంది. ఆది నుంచి రాముడిని పూజించే సన్యాసులతో కూడిన బృందం. వివాదాస్పద స్థలాన్ని తమకు అప్పగించాలని అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తామని ‘రామ్ లల్లా’, ‘రామ్ జన్మస్థాన్’ సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రామ్ లల్లాలో ఎక్కువ మంది విశ్వహిందూ పరిషద్ సభ్యులు ఉండగా, రామ్ జన్మస్థాన్‌లో ఎక్కువగా ఆరెస్సెస్ సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ‘రామ జన్మభూమి న్యాస్’తో హిందూ మహాసభ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాయి. తరతరాలుగా రాముడిని పూజించే హక్కు తమకే ఉందని, తామే నిజమైన ఆరాధకులమని, తమకే రామ జన్మభూమి స్థలం దక్కాలని ‘నిర్మోహి అఖారా’ వాదిస్తోంది. ఇందులో తమకు ఉందని వాదిస్తోన్న రామ్ లల్లా, రామ్ జన్మస్థాన్ సంఘాలతో అది తీవ్రంగా విభేదిస్తోంది. మరో పక్క ముస్లిం సంస్థల్లో కూడా పరస్పర విభేదాలు ఉన్నాయి. షియా, సున్నీ బోర్డులు వివాదాస్పద బాబ్రీ మసీదు తమదంటే తమదని వాదిస్తూ వస్తున్నాయి. షియా ముస్లిం వర్గానికి ‘అఖిల భారత షియా కాన్ఫరెన్స్’, ‘షియా వక్ఫ్ బోర్డ్’ ప్రాతినిథ్యం వహిస్తున్నండగా, సున్నీ ముస్లింలకు ‘సున్నీ వక్ఫ్ బోర్డ్’ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయోధ్య వివాదంలో మొదటి నుంచి ఉన్న ప్రధాన పార్టీ సున్నీ వక్ష్ బోర్డే. బాబ్రీ మసీదు స్థలాన్ని పూర్తిగా తమకు అప్పగించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆది నుంచి డిమాండ్ చేస్తున్న ఆ మేరకు 1961లో కోర్టులు పిటీషన్ దాఖలు చేసింది. అది షియా మసీదని, తమకే చెందాలని షియా వక్ఫ్ బోర్డు విభేదించింది. ఆ తర్వాత షియా వక్ఫ్ బోర్డు తన వైఖరిని మార్చుకుంది. దేశ సామరస్య, సమగ్రతలను పరిరక్షించడం కోసం హిందూ పార్టీలకు స్థలాన్ని అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ మేరకు 2018లో సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. మొదటి నుంచి ఉమ్మడిగా మసీదును నిర్మిద్దామని చెబుతున్న ‘అఖిల భారత్ షియా కాన్ఫరెన్స్’ ఆశ్చర్యంగా ‘సున్నీ వక్ఫ్ బోర్డు’కే ఇప్పటికీ అండగా నిలిచింది. 1992లో బాబ్రీ మసీదును కూల్చేసిన ప్రాంతంలోని 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలు చేసి నిర్మోహి అఖారా, హిందూ సంస్థలు, సున్నీ వక్ష్ బోర్డుకు పంచాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దాన్ని అన్ని పార్టీలు సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తెల్సిందే. క్లిష్టంగా తయారైన ఈ వివాదంపై ఈ రోజు విచారణ ముగించే సుప్రీం కోర్టు తీర్పును ఎప్పుడు, ఎలా వెలువరిస్తుందో ఎదురు చూడాల్సిందే. -
ఆ ఆకుపచ్చ జెండాలపై బదులివ్వండి
న్యూఢిల్లీ: నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ రంగు జెండాలను దేశంలో ఎగరేయరాదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దేశవ్యాప్తంగా భవనాలు, మతపరమైన ప్రాంతాల్లో ఈ జెండాలను నిషేధించడంపై అభిప్రాయం చెప్పాలం టూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఆకుపచ్చ రంగు జెండాలపై షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీమ్ రిజ్వీ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సమాధానం చెప్పేందుకు వీలుగా అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఈ పిటిషన్ కాపీని అందించాలని రిజ్వీకి ధర్మాసనం సూచించింది. నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండాలు ‘‘ఇస్లాం విరుద్ధం’’ అని, అవి పాకిస్తాన్‌లోని ఓ రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉన్నాయని రిజ్వీ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
అసలు బాబ్రీ మసీదే లేదు: షియా వక్ఫ్ బోర్డు
లక్నో : రామ మందిరం- బాబ్రీ మసీదు నిర్మాణ వివాదం గురించి ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ జన్మభూమి అయిన అయెధ్యలో కేవలం రామ మందిర నిర్మాణం మాత్రమే జరుగుతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ‘అయోధ్యలో అసలు బాబ్రీ మసీదు అనేది లేనే లేదు. ఇక ముందు కూడా ఉండబోదు. అది రామ జన్మభూమి. అక్కడ కేవలం రామ మందిరం మాత్రమే నిర్మించబడుతుంది. బాబర్ సానుభూతి పరులంతా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి ప్రయోజనం పొందేందుకే వసీం రిజ్వి ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, గతంలో కూడా వసీం రిజ్వి పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మదర్సాలు టెర్రరిస్టులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని... తక్షణమే మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి లేఖలు రాశారు. రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే వారంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలి లేదా ఉగ్రవాద సంస్థల్లో చేరాలంటూ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. -
‘అయోధ్యపై మీకు హక్కు లేదు’
సాక్షి, లక్నో: అయోధ్య వివాదం సున్నీ, షియా వర్గాల మధ్య మంటలు రేపుతోంది. బాబ్రీ మసీదు విషయంలో సున్నీ వక్ప్ బోర్డుకు ఎటువంటి హక్కులు లేవని షియా వక్ఫ్ బోర్డు ప్రకటించింది. బాబ్రీ మసీదు, వివాదాస్పద స్థలం గురించి తమ వద్ద తగిన డాక్యుమెంట్లు ఉన్నాయని షియా వక్ప్‌బోర్డు ఛైర్మన్ వాసిమ్ రిజ్వీ ప్రకటించారు. ఈ డాక్యుమెంట్లను ఇప్పటికే సుప్రీం కోర్టు ముందుంచినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సున్నీ వక్ఫ్ బోర్డు మధుర, కాశీలోని మందిర్-మసీదు వివాదాలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. అదే సమయంలో అయోధ్య వివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాసిమ్ రిజ్వీ స్పష్టం చేశారు. వివాదాస్పద స్థలంపై కోర్టు షియా వక్ఫ్ బోర్డుకు అనులకూంగా తీర్పునిస్తే.. అందులో హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఆలయం నిర్మించుకునేందుకు ఇచ్చేస్తామని ఆయన చెప్పారు. అదే సమయంలో లక్నోలో మరో మసీదు నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
ఆ ఒక్క సమాధి కూల్చితే చాలూ!
సాక్షి, న్యూఢిల్లీ : తాజ్ మహల్ వివాదం పచ్చిగా ఉండగానే.. ఇప్పుడు తెరపైకి మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. దేశ రాజధానిలోని హుమయున్ సమాధిని కూల్చివేయాలంటూ ఉత్తర ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. తద్వారా ముస్లింలకు పెద్ద సమస్య తీరుతుందని ఆయన అంటున్నారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ వసీమ్ రిజ్వీ లేఖలోని విషయాలను గురువారం మీడియాకు తెలియజేశారు. హుమయున్ సమాధిని కూల్చివేయాల్సిందే. ప్రస్తుతం దేశంలో ముస్లింలు చనిపోతే వారిని ఖననం చేసేందుకు స్థలం లేకుండా పోయింది. ఇప్పుడు హుమాయున్ సమాధి ఉన్న ప్రాంతాన్ని గనుక అప్పగిస్తే స్మశానం(ఖబరిస్థాన్) లోటు తీరుతుంది. మరో వందేళ్లదాకా ముస్లిం జనాభా కోసం స్మశాన వాటిక నిర్మించాల్సిన అవసరం లేదు. అని రిజ్వీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్టాల మూలంగా కొత్త సమాధులు నిర్మించటం సాధ్యమయ్యే పని కాదని.. అందుకే హుమయూన్ సమాధి కూల్చివేతకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. అయినా చనిపోయాక రాజు.. పేద తేడా ఏంటి? ఇప్పుడు ఆ సమాధిని ఇలా ఉపయోగించటం వల్ల ఆయన చేసిన పాపాల్లో కాస్తైన ప్రాయశ్చిత్తం దక్కుతుందేమో అని రిజ్వీ చెప్పారు. అభివృద్ధి కోసం ఖర్చు చేయాలే తప్ప.. దేశ సంపదను కొల్లగొట్టి.. ప్రజలను హింసించిన ఇలాంటి వారి సమాధులపై కాదని అన్నారు. ఇక తాజ్ వ్యవహారంపై స్పందిస్తూ... దానిని సమాధిగా ఎవరూ చూడరని.. ఓ అందమైన ప్రపంచ వింతగానే భావిస్తారని ఆయన అన్నారు. మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ సమాధి 30 ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉండగా.. మొత్తం 200 ఎకరాలకు పైగానే ఆ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో ‘ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’ అభివృద్ధి పనులను నిర్వహిస్తోంది. అయితే జాతీయ వారసత్వ సంపద జాబితాలో ఉన్న దీనిని తొలగించి కూల్చివేయాలని ఇప్పుడు షియా బోర్డే లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. -
మసీదులపై మీకేం హక్కుంది?: ఒవైసీ
హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అయోధ్య అంశంపై ట్విట్టర్లో స్పందించారు. కేవలం ఏదో ఒక మతపెద్ద చెప్పాడన్న కారణంతో మసీదు నిర్మాణం చేపట్టడం జరగదని ఆయన పేర్కొన్నారు. మసీదులన్నింటికి పెద్ద అల్లానే(భగవంతుడు). షియా, సున్ని, బరెల్వి, సూఫీ, దియోబంది, సలఫై, బొహ్రి ఇలా ఎన్ని బోర్డులు ఉన్నా వాటి బాధ్యత నిర్వాహణే తప్ప ఆధిపత్యం చెల్లాయించటం కాదంటూ ట్వీట్ లో ఒవైసీ పేర్కొన్నారు. "అల్లాను, ఆయనిచ్చే తీర్పును నమ్మేవాళ్లు మాత్రమే మసీదును నిర్మిస్తారు. వాళ్ల రక్షణ కోసం అందులో నమాజ్‌లు నిర్వహిస్తారు. కానీ, వాటిపై పూర్తి హక్కు మాత్రం అల్లాదే" అని స్పష్టం చేశారు. అయోధ్యకు దూరంగా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తర ప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టు ముందు ఓ ప్రతిపాదనను ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఒవైసీ ఇలా స్పందించారు.