సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని బాబ్రీ–రామ మందిరం వివాదం కేసుపై ఐదుగురు సుప్రీం కోర్టు జడ్జీల బెంచీ ముందు తుది విచారణ జరగుతున్న విషయం తెల్సిందే. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమై 38 రోజులకుపైగా కొనసాగిన విచారణ ఈ రోజుతో ముగుస్తుంది. ఇది కేవలం ముస్లిం, హిందువులకు మధ్య కొనసాగుతున్న వివాదంగా సామాన్య ప్రజలకు కనిపిస్తోంది. కానీ ఎన్నో పార్టీల ప్రమేయం ఎన్నో గొడవలు ఉన్నాయి. అటు ముస్లిం పార్టీల్లో, ఇటు హిందూ పార్టీల్లో పరస్పర విరుద్ధ వైఖరులు కూడా ఉన్నాయి. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి 16వ శతాబ్దంలో బాబర్ మసీదు నిర్మించారని, ఆ స్థలంలో తిరిగి రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతించాలని ‘నిర్మోహి అఖారా’ సంస్థ ఆది నుంచి డిమాండ్ చేస్తోంది. ఆది నుంచి రాముడిని పూజించే సన్యాసులతో కూడిన బృందం. వివాదాస్పద స్థలాన్ని తమకు అప్పగించాలని అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తామని ‘రామ్ లల్లా’, ‘రామ్ జన్మస్థాన్’ సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రామ్ లల్లాలో ఎక్కువ మంది విశ్వహిందూ పరిషద్ సభ్యులు ఉండగా, రామ్ జన్మస్థాన్‌లో ఎక్కువగా ఆరెస్సెస్ సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ‘రామ జన్మభూమి న్యాస్’తో హిందూ మహాసభ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాయి.
తరతరాలుగా రాముడిని పూజించే హక్కు తమకే ఉందని, తామే నిజమైన ఆరాధకులమని, తమకే రామ జన్మభూమి స్థలం దక్కాలని ‘నిర్మోహి అఖారా’ వాదిస్తోంది. ఇందులో తమకు ఉందని వాదిస్తోన్న రామ్ లల్లా, రామ్ జన్మస్థాన్ సంఘాలతో అది తీవ్రంగా విభేదిస్తోంది. మరో పక్క ముస్లిం సంస్థల్లో కూడా పరస్పర విభేదాలు ఉన్నాయి. షియా, సున్నీ బోర్డులు వివాదాస్పద బాబ్రీ మసీదు తమదంటే తమదని వాదిస్తూ వస్తున్నాయి. షియా ముస్లిం వర్గానికి ‘అఖిల భారత షియా కాన్ఫరెన్స్’, ‘షియా వక్ఫ్ బోర్డ్’ ప్రాతినిథ్యం వహిస్తున్నండగా, సున్నీ ముస్లింలకు ‘సున్నీ వక్ఫ్ బోర్డ్’ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయోధ్య వివాదంలో మొదటి నుంచి ఉన్న ప్రధాన పార్టీ సున్నీ వక్ష్ బోర్డే. బాబ్రీ మసీదు స్థలాన్ని పూర్తిగా తమకు అప్పగించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆది నుంచి డిమాండ్ చేస్తున్న ఆ మేరకు 1961లో కోర్టులు పిటీషన్ దాఖలు చేసింది. అది షియా మసీదని, తమకే చెందాలని షియా వక్ఫ్ బోర్డు విభేదించింది.
ఆ తర్వాత షియా వక్ఫ్ బోర్డు తన వైఖరిని మార్చుకుంది. దేశ సామరస్య, సమగ్రతలను పరిరక్షించడం కోసం హిందూ పార్టీలకు స్థలాన్ని అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ మేరకు 2018లో సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. మొదటి నుంచి ఉమ్మడిగా మసీదును నిర్మిద్దామని చెబుతున్న ‘అఖిల భారత్ షియా కాన్ఫరెన్స్’ ఆశ్చర్యంగా ‘సున్నీ వక్ఫ్ బోర్డు’కే ఇప్పటికీ అండగా నిలిచింది.
1992లో బాబ్రీ మసీదును కూల్చేసిన ప్రాంతంలోని 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలు చేసి నిర్మోహి అఖారా, హిందూ సంస్థలు, సున్నీ వక్ష్ బోర్డుకు పంచాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దాన్ని అన్ని పార్టీలు సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తెల్సిందే. క్లిష్టంగా తయారైన ఈ వివాదంపై ఈ రోజు విచారణ ముగించే సుప్రీం కోర్టు తీర్పును ఎప్పుడు, ఎలా వెలువరిస్తుందో ఎదురు చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment