సాక్షి, హైదరాబాద్: కరోనాను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. రోజువారి జరిగే కార్యకలాపాలు అన్ని ఆగిపోయాయి. దీంతో పేదలు, నిరాశ్రయులు, వలస కూలీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసే వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. లాక్‌డౌన్ విధించడంతో బస్సులు, రైళ్లు లేక సొంత ఊర్లకు వెళ్లలేక ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. వారందరూ పనిలేక, డబ్బులు లేక, ఆశ్రయం లేక ప్రతి రోజు పస్తులు ఉంటున్నారు. వారిని ఆదుకునేందుకు చాలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. (లాక్డౌన్లో వినూత్న కార్యక్రమం)
హైదరాబాద్ మసీదుబండలో నిర్మిస్తున్న మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ దగ్గర పని చేస్తున్న బెంగాల్, అస్సాం వలస కార్మికులకు విశ్వహిందూ పరిషత్ ఆహారాన్ని, నిత్యవసర సరుకులను అందించింది. దాదాపు 2000 మంది కార్మికుల వరకు ఇక్కడ చిక్కుకుపోయామంటూ విశ్వహిందూ పరిషత్‌కు కొంతమంది ఫోన్ చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ విశ్వహిందూ పరిషత్ హైదరాబాద్‌లోని తమ సభ్యులను వెంటనే అక్కడికి వెళ్లి వారికి సాయాన్ని అందించాలని ఆదేశించింది. వారు వెంటనే కార్మికులు ఉంటున్న ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని చూసి వారికి ఆహారపు పొట్లాలను, నిత్యవసర సరుకులను అందించారు. లాక్‌డౌన్ ఎత్తివేసే వరకు తాము సాయం అందిస్తామని, లాక్‌డౌన్ కారణంగా ఏ ఒక్కరు పస్తులు ఉండటానికి వీల్లేదని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవులు అన్నారు. దినసరి కూలీలు, పేదలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ లో పని చేసుకునే వలస కూలీలు ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్నం పెట్టేందుకు విశ్వహిందూ పరిషత్ ఎల్లవేళలా ముందు ఉంటుందని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేస్తే ఎప్పుడైనా తాము సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ ప్రకటించడంతో రెండో విడతలో మొదటిరోజైన ఏప్రిల్ 15న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం నుంచి 11 క్వింటాళ్ల బియ్యం, రెండు క్వింటాళ్ల పప్పు పంపిణీ చేశారు. రెండో విడతలో మొదటిరోజు కోటి, బషీర్ బాగ్, ఫిల్మ్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాలలో సరుకులు అందజేశారు. (కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి)
విశ్వహిందూ పరిషత్ హెల్ప్‌లైన్ నంబర్‌కు వస్తున్న కాల్స్ ఆధారంగా సరుకులు అందజేస్తున్నామని రాఘవులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి సత్యం, రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి , కార్యదర్శి బండారి రమేష్, క్షేత్ర సామాజిక సమరసతా ప్రముఖ్ భాస్కర్ , రాష్ట్ర సహ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి , ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కోకన్వీనర్ శివ రాములు పాల్గొన్నారు. (మానవత్వం చాటుతున్న వన్ వే మిషన్)
Comments
Please login to add a commentAdd a comment