
సిమ్లా: ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘స్టూడెంట్ నెం1’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఆదిత్య(ఎన్టీఆర్) చేయని తప్పుకు జైలులో శిక్ష అనుభవిస్తూ ‘లా’ చదివి తండ్రి కోరికను తీరుస్తాడు. కొంచెం అటూ ఇటూగా నిజజీవితంలోనూ ఇలాంటి ఘటనే సిమ్లాకు చెందిన 27 ఏళ్ల విక్రమ్ సింగ్‌కు ఎదురైంది. అత్యాచార కేసులో స్థానిక సెషన్స్ కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. దీంతో తన సివిల్స్ కల చెదిరిందనుకున్నాడు. కానీ ఓ వైపు తాను నిర్దోషినంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పోరాటం చేస్తూనే మరోవైపు జైలులోనే సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. విక్రమ్ సింగ్ కృషి, పట్టుదల, నమ్మకంతో సగం విజయం సాధించాడు. హైకోర్టు అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పును వెలువరించింది. ఇక తరువాతి లక్ష్యం సివిల్స్ సాధించడమే అని అతడు పేర్కొన్నాడు.
నిరుద్యోగుల కోసం ‘కాంపిటీషన్ కంపెనియన్’
జైలు జీవితం గురించి విక్రమ్ సింగ్ ఆయన మాటల్లోనే ‘రెండేళ్లు జైలు జీవితం గడిపా. నేను ఎలాంటి తప్పు చేయలేదని నా అంతరాత్మకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలుసు. సెషన్స్ కోర్టు దోషిగా తేల్చి జైలు శిక్ష విధించినప్పుడు ఆందోళన చెందలేదు. న్యాయవ్యవస్థపై నమ్మకంతోనే హైకోర్టులో పోరాడా. చివరికి విజయం సాధించా. జైలులో ఉన్నప్పుడు కుంగిపోకుండా నా సివిల్స్ ప్రిపరేషన్ ఆగకూడదని నిశ్చయించుకొని దానికనుగుణంగా కష్టపడ్డాను.
అదే విధంగా నా లాంటి నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ‘కాంపిటీషన్ కంపెనియన్’అనే మ్యాగజైన్ రాశాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి నేను రాసిన పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో చాలా మంది యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విశేష ప్రచారం చేయాలని భావిస్తున్నాను.
వారికి ప్రత్యేక ధన్యవాదాలు
హిమాచల్ ప్రదేశ్ జైళ్ల శాఖ డీజీ జనరల్ సోమేశ్ గోయల్‌కు, ఇతర జైలు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలయజేస్తున్నాను. వారు జైలులోని ఖైదీలలో పరివర్తన తీసుకరావడానికి ఎంతగానో ప్రయత్నించేవారు. నేను సివిల్స్‌కు ప్రిపేర్ కావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా మ్యాగజైన్ రాసేటప్పుడు ఎంతో సహాయం చేశారు. వారు చేసిన సహాయసహకారాలకు జీవితాంతం రుణపడి ఉంటాను’అంటూ విక్రమ్ సింగ్ పేర్కొన్నాడు.
ఆనందంగా ఉంది: సోమేశ్ గోయల్
‘నన్ను, మా అధికారులను విక్రమ్ సింగ్ కలిసి తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. మీరు సహకరిస్తే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని పేర్కొన్నాడు. అతడికి కావల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాము. పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం మ్యాగజైన్ రాస్తానని చెబితే అతడికి కావల్సిన వార్తా పత్రికలు, ఇతర మ్యాగజైన్స్ అందించాము. విక్రమ్ సింగ్ రాసిన మ్యాగజైన్ విడుదల కావడం ఆనందంగా ఉంది. విక్రమ్ సింగ్ ఒక్కడికే కాదు జైలులో ఉన్న ఖైదీలందరికీ సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తూ, అనేక సదుపాయాలు, అవకాశాలు కల్పిస్తున్నాం’అంటూ జైళ్ల శాఖ డీజీ సోమేశ్ గోయల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment