
సాక్షి, ముంబై : శ్రీరాముడు దిగివచ్చినా దేశంలో లైంగిక దాడులను ఆపలేడని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ బీజేపీపై శివసేన విరుచుకుపడింది. శాంతి భద్రతలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిన క్రమంలోఈ పరిస్థితిల్లో బీజేపీ రామ రాజ్యాన్ని ఎలా ప్రతిష్టిస్తుందని ప్రశ్నించింది. 2012లో నిర్భయ ఘటన చోటుచేసుకున్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత పాలక పార్టీ వైఖరి గతం కంటే భిన్నంగా ఉందని శివసేన దుయ్యబట్టింది. ప్రభుత్వాలు మారినా లైంగిక దాడులు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
భావోద్వేగ అంశాలతో చెలగాటమాడటం హింసకు దారితీస్తుందని, ఎన్నికల్లో విజయం కోసం ఈ తరహా వ్యూహాలను అనుసరించాలని శ్రీరాముడు ఎన్నడూ చెప్పలేదని వ్యాఖ్యానించింది. బీజేపీ రామ రాజ్యాన్ని తీసుకురావడంపై మాట్లాడుతుందని, ఎలా రామ రాజ్యాన్ని తీసుకువస్తారో ఆ పార్టీ స్పష్టం చేయాలని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన నిలదీసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనా రామ రాజ్యం రాలేదని వ్యాఖ్యానించింది.
స్వయంగా దేవుడే దిగివచ్చినా దేశంలో అత్యాచారాలను నిరోధించలేడని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలే శాంతిభద్రతలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందని తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొంది. అన్నీ డబ్బులతో సమకూరవని పేర్కొన్న శివసేన మహిళల భద్రతను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది. నిరుద్యోగ సమస్యను కేవలం మాటలతో పరిష్కరించలేరని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment