‘ఈ నష్టం ఫుల్‌టైం రక్షణ మంత్రి లేనందువల్లే’
న్యూఢిల్లీ: శివసేన పార్టీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రక్షణశాఖ పూర్తిస్థాయి మంత్రిని ఎందుకు పెట్టడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి లేకపోవడం వల్లే సరిహద్దులో జవాన్లకు నష్టం జరుగుతుందని మండిపడ్డారు. భారత ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి ఉమర్ ఫయాజ్ ను కశ్మీర్‌లో కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు అనంతరం హత్య చేసిన నేపథ్యంలో శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ డిమాండ్ చేసింది.
భారత్‌కు పూర్తి స్థాయిలో పనిచేసే రక్షణ మంత్రి లేకపోవడం వల్లే ప్రస్తుతం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీగానీ, ఆయన ప్రభుత్వంగానీ అంత తీవ్రంగా పరిగణించడం లేదు. ఇంత జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదు. రక్షణశాఖ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు సగంగాను సగంలో సగంగాను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నష్ట నివారణకు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేసింది.