diffence minister
-
యూఎస్ రక్షణ మంత్రి మేటిస్ రాజీనామా
వాషింగ్టన్: అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ మంత్రి వర్గం నుంచి రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్ వైదొలిగారు. ట్రంప్ విదేశాంగ విధానాలతో విభేదించిన ఆయన తన పదవికి గురువారం రాజీనామా చేశారు. సిరియా నుంచి బలగాలను ఉపసంహరణను పునఃసమీక్షించుకోవాలని సూచించేందుకు మేటిస్ గురువారం శ్వేతసౌధానికి వెళ్లి ట్రంప్‌తో సమావేశమై చర్చించారు. బలగాల ఉపసంహరణ వద్దన్న మేటిస్ సూచనలను ట్రంప్ పట్టించుకోలేదు. దీంతో తాను రక్షణ మంత్రి బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ట్రంప్‌కు ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 28తో మేటిస్ పదవీ కాలం ముగియనుంది. తర్వలోనే నూతన రక్షణ మంత్రి పేరును వెల్లడిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. మేటిస్ నిష్క్రమణ అమెరికా మిత్ర దేశాలు, రిపబ్లికన్ సభ్యులను షాక్‌కు గురి చేశాయి. భారత్‌కు మంచి మిత్రుడు! మేటిస్ రాజీనామాతో ట్రంప్ ప్రభుత్వంలో భారత్ ఓ గొప్ప మిత్రుడిని కోల్పోయింది. పదవిలో ఉన్నన్నాళ్లూ భారత్ సహా పలు మిత్ర దేశాలకు అన్ని అంతర్జాతీయ వ్యవహారాల్లో మేటిస్ మద్దతుగా నిలిచారాన్న పేరుంది. రష్యా నుంచి ఎస్ 400 క్షిపణుల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న భారత్‌ను అమెరికా ఆంక్షల నుంచి కాపాడేందుకు యత్నించారు. నాలుగు నెలల క్రితం అమెరికా కాంగ్రెస్ విచారణ సందర్భంగా భారత్‌కు ఆంక్షల నుంచి మినహాయింపునిస్తూ చట్టం చేయాలని ఉభయ చట్టసభల సభ్యులను మేటిస్ కోరారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు గానీ, మేటిస్ భారత్‌పై ఆంక్షలు విధించకుండా చూస్తామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు హామీ ఇచ్చారు. పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా సైనిక కమాండ్ పేరును భారత్–పసిఫిక్ కమాండ్‌గా మార్చడానికి మేటిస్ కారణం. ఇండియాతో పెరిగిన బంధం, చైనాతో రెండు దేశాలకు ఎదురవుతున్న సవాళ్ల కారణంగా అమెరికా కమాండ్ పేరులో భారత్ పదం చేర్చడానికి మేటిస్ చొరవ తీసుకున్నారు. -
'వారిని వెతికి వేటాడి చంపండి'
లండన్ : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరే బ్రిటన్‌కు చెందిన పౌరులను వెతికి వేటాడి చంపాల్సిందేనని ఆ దేశ రక్షణశాఖ మంత్రి గావిన్ విలియమ్సన్ అన్నారు. పలువురు బ్రిటన్ నుంచి ఇరాక్, సిరియా వంటి దేశాలకు వెళ్లి అక్కడ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నారని, ఈ విషయాలను తాము జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అలాంటి వారిని కచ్చితంగా వేటాడి చంపాల్సిందేనని సూచించారు. ప్రస్తుతం ఇరాక్, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్‌లో దాదాపు 270మంది బ్రిటన్ పౌరులు ఉన్నట్లు తాము గుర్తించామని, వారిని మట్టుబెట్టేందుకు అవసరం అయితే బలగాలు వైమానిక దాడులు కూడా చేయాలని సూచించారు. 'వీలయిన ప్రతీది మనం తప్పకుండా చేయాలి. బెదిరింపులను తప్పించేందుకు మనం కూడా విధ్వంసం చేయాలి' అని ఆయన ఆవేశంగా అన్నారు. అంతేకాకుండా బ్రిటన్ నుంచి వెళ్లి ఐసిస్‌లో చేరినవారిని తిరిగి బ్రిటన్ రానివ్వకుండా చేయాలని, వారిని అంతమొందించాలని చెప్పారు. -
‘ఈ నష్టం ఫుల్‌టైం రక్షణ మంత్రి లేనందువల్లే’
న్యూఢిల్లీ: శివసేన పార్టీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రక్షణశాఖ పూర్తిస్థాయి మంత్రిని ఎందుకు పెట్టడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి లేకపోవడం వల్లే సరిహద్దులో జవాన్లకు నష్టం జరుగుతుందని మండిపడ్డారు. భారత ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి ఉమర్ ఫయాజ్ ను కశ్మీర్లో కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు అనంతరం హత్య చేసిన నేపథ్యంలో శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ డిమాండ్ చేసింది. భారత్‌కు పూర్తి స్థాయిలో పనిచేసే రక్షణ మంత్రి లేకపోవడం వల్లే ప్రస్తుతం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీగానీ, ఆయన ప్రభుత్వంగానీ అంత తీవ్రంగా పరిగణించడం లేదు. ఇంత జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదు. రక్షణశాఖ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు సగంగాను సగంలో సగంగాను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నష్ట నివారణకు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేసింది.