అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ మంత్రి వర్గం నుంచి రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్ వైదొలిగారు. ట్రంప్ విదేశాంగ విధానాలతో విభేదించిన ఆయన తన పదవికి గురువారం రాజీనామా చేశారు. సిరియా నుంచి బలగాలను ఉపసంహరణను పునఃసమీక్షించుకోవాలని సూచించేందుకు మేటిస్ గురువారం శ్వేతసౌధానికి వెళ్లి ట్రంప్‌తో సమావేశమై చర్చించారు.
బలగాల ఉపసంహరణ వద్దన్న మేటిస్ సూచనలను ట్రంప్ పట్టించుకోలేదు. దీంతో తాను రక్షణ మంత్రి బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ట్రంప్‌కు ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 28తో మేటిస్ పదవీ కాలం ముగియనుంది. తర్వలోనే నూతన రక్షణ మంత్రి పేరును వెల్లడిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. మేటిస్ నిష్క్రమణ అమెరికా మిత్ర దేశాలు, రిపబ్లికన్ సభ్యులను షాక్‌కు గురి చేశాయి.
భారత్‌కు మంచి మిత్రుడు!
మేటిస్ రాజీనామాతో ట్రంప్ ప్రభుత్వంలో భారత్ ఓ గొప్ప మిత్రుడిని కోల్పోయింది. పదవిలో ఉన్నన్నాళ్లూ భారత్ సహా పలు మిత్ర దేశాలకు అన్ని అంతర్జాతీయ వ్యవహారాల్లో మేటిస్ మద్దతుగా నిలిచారాన్న పేరుంది. రష్యా నుంచి ఎస్ 400 క్షిపణుల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న భారత్‌ను అమెరికా ఆంక్షల నుంచి కాపాడేందుకు యత్నించారు. నాలుగు నెలల క్రితం అమెరికా కాంగ్రెస్ విచారణ సందర్భంగా భారత్‌కు ఆంక్షల నుంచి మినహాయింపునిస్తూ చట్టం చేయాలని ఉభయ చట్టసభల సభ్యులను మేటిస్ కోరారు.
దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు గానీ, మేటిస్ భారత్‌పై ఆంక్షలు విధించకుండా చూస్తామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు హామీ ఇచ్చారు. పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా సైనిక కమాండ్ పేరును భారత్–పసిఫిక్ కమాండ్‌గా మార్చడానికి మేటిస్ కారణం. ఇండియాతో పెరిగిన బంధం, చైనాతో రెండు దేశాలకు ఎదురవుతున్న సవాళ్ల కారణంగా అమెరికా కమాండ్ పేరులో భారత్ పదం చేర్చడానికి మేటిస్ చొరవ తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment