రేపు ‘మహా’ కేబినెట్ విస్తరణ
శివసేనకు 12 మంత్రిపదవులు కేటాయింపు!
ముంబై: ముఖ్యమంత్రి ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరడం దాదాపు ఖరారైన నేపథ్యంలో.. మహారాష్ట్రలో రేపు(శుక్రవారం) మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలో కొత్తగా 20 మందికి పైగా అవకాశం కల్పిస్తారని, వారిలో సగానికి పైగా శివసేన వారుంటారని సమాచారం. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను మంగళవారం ఢిల్లీలో కలిసిన ఫడ్నవిస్.. తాజా జాబితాపై ఆయన ఆమోదం పొందారు.
శివసేన, బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా 5 కేబినెట్ బెర్త్‌లు సహా మొత్తం 12 మంత్రిపదవులు సేనకు ఇస్తున్నారని శివసేన సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. అయితే, తమకు కేటాయించనున్న శాఖల విషయంలో శివసేన అసంతృప్తితో ఉందని సమాచారం. తాము మొదట్నుంచీ హోం, రెవెన్యూ, ప్రజా పనుల శాఖలను కోరుతున్నామని, అయినా, తమకు ఆఫర్ చేసిన పరిశ్రమలు, పర్యావరణం, ఆరోగ్యం తదితర శాఖలు కూడా అంత అప్రాధాన్యమైనవేం కాదని బుధవారం శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలోనూ మరో కేబినెట్ హోదా కోరామన్నారు.