
‘ఆ వీడియోలతో వస్తే రూ.పది వేలు ఇస్తాం’
గ్వాలియర్: అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వివాహ కార్యక్రమాలు ఇతర ఉత్సవాల్లో సెలబ్రిటీలు తుపాకులు పేల్చడం పరిపాటి అవుతోంది. ఆ తుపాకులు కావాలని పేలుస్తున్నవి కాదని, అనుకోకుండా జరుగుతున్న సంఘటనలని చెబుతూ వారు తప్పించుకుంటున్నారు. ఇలాంటివి గ్వాలియర్ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అక్కడి జిల్లా యంత్రాంగం ఒక వినూత్న ఆలోచన చేసింది. పెళ్లి తదితర వేడుకల్లో ఎవరైతే తుపాకీ పేలుస్తారో ఆ చర్యలను వీడియో రికార్డింగ్ చేసి ఆధారాలుగా సమర్పించే వ్యక్తులకు రూ.10 వేలను రివార్డుగా ఇస్తామని ప్రకటించింది.
గ్వాలియర్ ప్రాంతంలో విందు, వినోదాలే కాకుండా తమకు సంతోషం కలిగించే ఏ సందర్భాల్లోనైనా మరోమారు ఆలోచించకుండా గాల్లోకి తుపాకులు పెట్టి కాలుస్తుంటారు. దీని వల్ల చాలా సార్లు ప్రాణనష్టం కూడా చోటు చేసుకుంది. ఇలాంటి చర్యలు చట్ట ప్రకారం తప్పు. అయినా, అలాంటి వారిని నిలువరించేందుకు ఆధారాలు సరిగా లభ్యం కావు. దీంతో ఆ చర్యలను అడ్డుకునేందుకు తాజాగా పదివేల రివార్డును ప్రకటించింది.